
SBI Insurance Policy: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఒక వినూత్నమైన, విస్తృతమైన ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇది సంవత్సరానికి కేవలం రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల భారీ ప్రమాద బీమా కవరేజీని అందిస్తుంది. ఈ పథకం దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఖాతాదారులకు అందుబాటులో ఉంది. వారికి ఊహించని ప్రమాదాల నుండి రక్షణ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ గురించి విజయవాడ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మీకాంతరావు ఓ మీడియాకు వివరించారు.
ఇది కూడా చదవండి: నెలకు రూ.10,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో చేతికి రూ.32 లక్షలు
ఈ ప్రమాద బీమా పథకానికి 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎస్బీఐ ఖాతాదారులు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉంటుంది. ఎస్బీఐ యోనో (YONO) యాప్, నెట్ బ్యాంకింగ్ లేదా సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా ఈ పాలసీని తీసుకోవచ్చు. నామినీ వివరాలను సులభంగా నమోదు చేయవచ్చు. నామినీకి ఎస్బీఐ ఖాతా ఉండవలసిన అవసరం లేదు. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా, ప్రమాదం సంభవించినప్పుడు వారికి బీమా మొత్తం చెల్లిస్తారు.
ఈ పాలసీ అన్ని రకాల ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఇందులో పాము కాటు, విద్యుత్ షాక్ వంటివి కూడా ఉన్నాయి. అయితే, ఆత్మహత్య (సూసైడ్) మాత్రం ఈ బీమా కవరేజీ పరిధిలోకి రాదు. ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు డాక్టర్ ధృవీకరణ పత్రం అవసరం.
క్లెయిమ్ చేసుకోవడానికి నామినీ కేవైసీ (పాన్ కార్డ్, ఆధార్ కార్డ్), డెత్ సర్టిఫికెట్ ఒరిజినల్ సమర్పించాల్సి ఉంటుంది. ఎటువంటి జాప్యం లేకుండా, కేవైసీ సరిపోలితే, బీమా మొత్తం ఒకే రోజులో లేదా గరిష్టంగా ఒక రోజులోపు చెల్లిస్తారు.
ఎస్బీఐలో వ్యక్తిగత ప్రమాద బీమా 2012లో రూ.100 ప్రీమియంతో రూ.2 లక్షల కవరేజీతో ప్రారంభమైంది. అప్పటి నుండి రూ.200కి రూ.4 లక్షలు, రూ.500కి రూ.10 లక్షలు, రూ.1,000కి రూ.20 లక్షలు, రూ.2,000కి రూ.40 లక్షలు వంటి వివిధ ప్రీమియం స్థాయిలలో కవరేజీని అందిస్తూ వచ్చింది. ప్రస్తుత రూ.3,000 ప్రీమియం రూ.60 లక్షల కవరేజీ పరిశ్రమలోనే అత్యధికమని ఎస్బీఐ పేర్కొంది.
ఈ పథకం ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్యంగా రోజువారీ ప్రమాదాల నుండి తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా సేవలు అందిస్తుంది. ఎస్బీఐ దీనిని సామాజిక బాధ్యతగా పరిగణిస్తూ, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి