
స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఓ వైకుంఠపాళీ. ఏ పాము ఎప్పుడు కరుస్తుందో.. ఏ నిచ్చెన ఎప్పుడు మనల్ని గమ్యస్థానానికి చేరుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మంచి స్టాక్ అని కొన్నది పేలవమైన రన్ సాగించవచ్చు. పెన్నీ స్టాక్ అనుకున్నది పైకి ఎక్కి కూర్చోవచ్చు. మాములుగా ఓ స్టాక్ కంపెనీ ప్రాధమిక అంశాలు, ప్రధాన కాంట్రాక్టులు ఆధారంగా మంచి రన్ కొనసాగిస్తుంది. కానీ ఇక్కడొక స్టాక్ కేవలం ఓ రూమర్ ఆధారంగా కేవలం 10 నెలలలోపు రూ. 10 నుంచి దాదాపు రూ. 9,000 కు పెరిగింది. ఇంతకీ ఆ స్టాక్ ఏంటంటే.. RRP సెమీకండక్టర్స్ లిమిటెడ్. సచిన్ టెండూల్కర్‌తో లింక్ ఉన్న ఆ రూమర్..
గత సంవత్సరంలో దాదాపుగా 13 వేల శాతం పైగా పెరిగిన ఈ స్టాక్.. ఎంతలా అంటే కంపెనీ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆ రూమర్‌పై క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ‘క్రికెటర్ సచిన్ టెండూల్కర్ RRP సెమీకండక్టర్స్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టారని తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. దీని కారణంగా గత 10 నెలల్లో షేర్ ధర రూ. 10 నుంచి రూ. 9,000 వరకు పెరిగినట్టు మేం భావిస్తున్నాం’ అని కంపెనీ NSE, BSEకి ఇచ్చిన ఫాంలో పేర్కొంది. టెండూల్కర్ ప్రమేయం లేదని పూర్తిగా ఖండించిన కంపెనీ.. ఇలా పేర్కొంటూ..
– సచిన్ ఎప్పుడూ RRP సెమీకండక్టర్స్ షేర్లకు కొనుగోలు చేయలేదు.
– సచిన్ కంపెనీలో వాటాదారుడు, బోర్డు సభ్యుడు లేదా సలహాదారుడు కాదు.
– ఏ హోదాలోనూ కంపెనీతో కనెక్ట్ కాలేదు, బ్రాండ్ అంబాసిడర్ కూడా కాదు.
ఇలా కంపెనీకి విరుద్దంగా ప్రకటన వచ్చినప్పటికీ.. RRP సెమీకండక్టర్స్ షేర్లు మంగళవారం మరో 2 శాతం పెరిగాయి. ఈ స్టాక్‌లో కేవలం పబ్లిక్ షేర్‌హోల్డర్ల దగ్గర కేవలం 4,000 షేర్లు మాత్రమే ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘కొంతమంది వ్యక్తులు ఈ స్టాక్ ద్వారా అనైతికంగా వ్యాపారం సాగిస్తున్నారని.. దీని వల్ల కంపెనీకి, టెండూల్కర్‌కు అపఖ్యాతి వాటిల్లుతోంది’ అని సంస్థ తెలిపింది.