
వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వెండి ధరలో దిద్దుబాటు జరగవచ్చని, పెట్టుబడిదారులు భావోద్వేగంతో అధిక స్థాయిలో కొనుగోలు చేయకుండా ఉండాలని ఆయన అన్నారు. అలాగే భవిష్యత్తులో వెండి ధర ఎలా ఉండబోతుందని కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర రూ.2.41 లక్షలకు పైగా చేరుకుంది.
రాబర్ట్ కియోసాకి ఎక్స్‌లో వెండి బుడగ పగిలిపోతుందా? అని రాశారు. మీరు వెండిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఓపిక పట్టండి. పతనం కోసం వేచి ఉండండి, ఆపై కొనాలా వద్దా అని నిర్ణయించుకోండి అని కియోసాకి పెట్టుబడిదారులకు సలహా ఇచ్చారు. ఇటీవలి నెలల్లో వెండి ధరలు అనూహ్యంగా పెరిగిన సమయంలో ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. 2025లో ఇప్పటివరకు వెండి దాదాపు 160 శాతం పెరిగింది. ఇటీవల మొదటిసారిగా ఔన్సుకు 80 డాలర్లు దాటింది. అయితే అప్పటి నుండి అది తీవ్ర తగ్గుదలను చూసింది.
తన రిచ్ డాడ్ ఫిలాసఫీని ఉటంకిస్తూ కియోసాకి ఇలా అన్నారు.. లాభాలు అమ్మినప్పుడు కాదు, కొనుగోలు చేసినప్పుడు వస్తాయి. ఆయన ప్రకారం దీర్ఘకాలిక సంపద సృష్టికి కీలకం భావోద్వేగ కొనుగోలు లేదా అమ్మకం కాదు, సరైన ప్రవేశ స్థానం అని. అయితే స్వల్పకాలిక నష్టాల గురించి హెచ్చరించినప్పటికీ, కియోసాకి వెండిపై తన దీర్ఘకాలిక బుల్లిష్ దృక్పథం నుండి వెనక్కి తగ్గలేదు. 2026 నాటికి కిలో వెండి రూ.6.34 లక్షలు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. మంగళవారం MCXలో వెండి ధరలు రూ.12,159 పెరిగి కిలోకు రూ.237,225 ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈరోజు కమోడిటీ మార్కెట్లో వెండి బుల్స్ బలమైన పునరాగమనం చేశాయి. అయితే దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇది దాని ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.2,54,174 కంటే తక్కువగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి