Road Accidents: రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్స.. కీలక చర్యలు తీసుకున్న కేంద్రం

రోడ్డు ప్రమాదం అంటే ఓ మనిషి రోడ్డుపై పడడం కాదు ఓ కుటుంబం వీధిన పడడం అనే సినిమా డైలాగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. అయితే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ స్థాయి మరణాలు సరైన చికిత్స సమయానికి అందకపోవడంతో సంభవిస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేలా కేంద్రం కీలక చర్యలు తీసుకుంది.

Road Accidents: రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్స.. కీలక చర్యలు తీసుకున్న కేంద్రం
Road Accidents

Updated on: May 08, 2025 | 3:30 PM

భారతదేశం అంతటా రోడ్డు ప్రమాద బాధితులు నియమించిన ఆసుపత్రుల్లో మొదటి ఏడు రోజులు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందేందుకు అర్హత ఉంటుందని కేంద్ర స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం మే 5, 2025 నుంచిడి అమల్లోకి వచ్చిందని పేర్కొంటూ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యం అందించడానికి జరిగే జాప్యం కారణంగా ఎక్కువ మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ఏదైనా రహదారిపై మోటారు వాహనాల వల్ల ప్రమాదానికి గురైన ఏ వ్యక్తి అయినా ఈ పథకానికి సంబధించిన నిబంధనలకు అనుగుణంగా నగదు రహిత చికిత్సకు అర్హత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థగా జాతీయ ఆరోగ్య అథారిటీ (ఎన్‌హెచ్ఏ) వ్యవహరిస్తుంది. పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థలు మొదలైన వాటి సమన్వయంతో నగదు రహిత చికిత్స అందిస్తారు. రోడ్డ ప్రమాద బాధితుడు ప్రభుత్వం నోటిఫై చేసిన ఆసుపత్రిలో ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజుల వరకు లక్షా యాభై వేల రూపాయల వరకు నగదు రహిత చికిత్స పొందేందుకు అర్హత ఉంటుంది. ప్రభుత్వం విడుల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నియమించిన ఆసుపత్రి కాకుండా ఇతర ఆసుపత్రిలో ఈ పథకం కింద చికిత్స స్థిరీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే మార్గదర్శకాల ద్వారా పేర్కొన్న విధంగా ఉండాలి.

కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి పథకాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. అలాగే ఆసుపత్రులను ఆన్బోర్డింగ్ చేయడానికి, బాధితులకు చికిత్స చేయడానికి, నియమించిన ఆసుపత్రికి చికిత్స, సంబంధిత విషయాలపై చెల్లింపు కోసం పోర్టల్‌ను స్వీకరించడం, ఉపయోగించడం కోసం జాతీయ ఆరోగ్య అథారిటీతో సమన్వయం చేసుకునే బాధ్యతను కలిగి ఉంటుంది. ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం రోడ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 11 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ, ఎంఓఆర్‌టీహెచ్ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఫలితంగా 1.72 లక్షల మంది మరణించారని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు తర్వాత ఈ పథకం అమల్లోకి రావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి