
GDP Growth: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ది అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతం వృద్ది నమోదు చేసింది. జీఎస్టీ రేట్లలో కోతల కారణంగా వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ పెరగడంతో గరిష్ట స్థాయిలో జీడీపీ వృద్ది నమోదు చేసింది. గత ఆరు త్రైమాసికాల కంటే ఇది అత్యధికమని చెబుతున్నారు. 2025 ఆర్ధిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ది చెందింది. మూడు రోజుల పాటు జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ విధాన కమిటీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ జీడీపీ వృద్ది అంచనాలను విడదుల చేసింది.
2026 ఆర్ధిక సంవత్సరంలో Q3 జీడీపీ వృద్ది అంచనాను 6.4 శాతం నుంచి 7.0 శాతానికి పెంచగా.. Q4 అంచనాను 6.2 శాతం నుంచి 6.5కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆర్ధిక సంవత్సరం 2027లో Q1కు 6.4 శాతం నుంచి 6.7కు పెంచగా.. Q2కు 6.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఈ ఆర్ధిక సంవత్సర మొదటి భాగంలో ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ రేట్లలో సవరణలు, ముడి చమురు ధరలు తగ్గుదల, మూలధన వ్యయంలో పెరుగుదల, అనుకూల ద్రవ్య, ఆర్ధిక పరిస్థితుల కారణంగా ప్రయోజనం లభించిందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
“మూడో త్రైమాసికమైన అక్టోబర్-నవంబర్‌లో జీఎస్టీ రేట్ల కోత, పండుగ సమయాలు జీడీపీ వృద్దికి అనుకూలించాయి. ఊహించిన దానికంటే బలమైన GDP వృద్ధి జరిగింది జూలై-సెప్టెంబర్ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. జీఎస్టీ సుంకాలను తగ్గించడంతో వినియోగదారుల డిమాండ్‌లో పెరుగుదలకు దారితీసింది” అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.