ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు..! ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన రిలయన్స్‌

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు చేసిందన్న అంతర్జాతీయ మీడియా నివేదికలను ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రాయిటర్స్ వంటి వార్తా సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు గురించి ప్రస్తావించగా, అలాంటి లావాదేవీ ఏదీ జరగలేదని రిలయన్స్ స్పష్టం చేసింది.

ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు..! ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన రిలయన్స్‌
Reliance Industries

Updated on: Mar 26, 2026 | 9:02 PM

భారతీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు చేసిందన్న వార్తలను పూర్తిగా ఖండించింది. గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి అని కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు ముఖ్యంగా రాయిటర్స్ కథనం ప్రకారం రిలయన్స్ సంస్థ నేషనల్‌ ఇరానీయన్‌ ఆయిల్‌ కంపెనీ నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసిందని పేర్కొన్నాయి. ఈ లావాదేవీ బ్రెంట్ ఫ్యూచర్స్ కంటే ఎక్కువ ధరకు జరిగిందని, అలాగే అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించడంతో ఇది సాధ్యమైందని ఆ నివేదికలో వెల్లడైంది.

అయితే ఈ అంశాలన్నింటినీ ఖండిస్తూ రిలయన్స్ సంస్థ స్పష్టంగా స్పందించింది. ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు చేశామన్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. ఇలాంటి కథనాలు ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి అని కంపెనీ పేర్కొంది. నివేదికల ప్రకారం ఈ సరుకులు మార్చి 20 నాటికి లోడ్ చేసి, ఏప్రిల్ 19 నాటికి డెలివరీ అయ్యేలా ఒప్పందం కుదిరిందని చెప్పబడింది. కానీ రిలయన్స్ సంస్థ అలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని స్పష్టం చేసింది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ చమురు వ్యాపారంపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ వార్తలు మార్కెట్లలో చర్చకు దారితీసినప్పటికీ, రిలయన్స్ ఖండనతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. మొత్తంగా ఇరాన్ చమురు కొనుగోలుపై వచ్చిన వార్తలను రిలయన్స్ పూర్తిగా తిరస్కరించడంతో, ప్రస్తుతానికి ఆ లావాదేవీపై ఉన్న అనుమానాలు కొంతవరకు నివృత్తి అయ్యాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us