RBI: రుణాల చెల్లింపు మరింత భారం కానుందా..! ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకోబోతోంది..?

పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ చర్యలు తీసుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికి రెపో రేటును పెంచిన ఆర్బీఐ మరోసారి పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు...

RBI: రుణాల చెల్లింపు మరింత భారం కానుందా..! ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకోబోతోంది..?
Rbi

Updated on: Jun 05, 2022 | 9:40 AM

పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ చర్యలు తీసుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికి రెపో రేటును పెంచిన ఆర్బీఐ మరోసారి పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.40 శాతం చేయడంతో బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనుంది. ‘ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని, రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉంది’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత సమావేశంలో తెలిపారు. ఈసారి సమీక్షలో మరో 35-40 బేసిస్‌ పాయింట్లు పెంచినా.. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపోరేటు 5.15 శాతానికి చేరేందుకు అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆర్‌బీఐ అంచనాలకు మించి ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే కొనసాగింది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై రూ.8, డీజిలుపై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీతో పాటు ప్లాస్టిక్‌, స్టీల్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించింది. దీనికితోడు ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుతుండటం, రుతుపవనాలు సానుకూలంగానే ఉంటాయనే నివేదికలు ఈసారి పరపతి సమీక్షలో కీలకం మారే అవకాశం ఉంది. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు కనిపించడం లేదు. దీంతో వచ్చే నాలుగు విధాన సమీక్షల్లో కలిపి 1 శాతం వరకూ వడ్డీ రేట్లు పెరిగేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోందని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. రెపో రేటు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచుతాయి.