Gold Reserves: పసిడి కొనుగోలులో RBI దూకుడు.. 876 టన్నులకు చేరిన నిల్వలు.. చైనా దగ్గర..

|

Jan 06, 2025 | 10:52 PM

బంగారం కొనుగోళ్లలో భారత్ దూకుడు కొనసాగించింది. 2024 నవంబర్ మాసంలో భారత కేంద్ర బ్యాంకు ఆర్బీఐ 8 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ దగ్గరున్న పసిడి నిల్వలు 876 టన్నులకు చేరింది. నవంబర్ మాసంలో వివిధ సెంట్రల్ బ్యాంకులు 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా.. పోలండ్, ఉజ్బెకిస్థాన్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.

Gold Reserves: పసిడి కొనుగోలులో RBI దూకుడు.. 876 టన్నులకు చేరిన నిల్వలు.. చైనా దగ్గర..
Gold Reserves
Follow us on

Gold Reserves: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ పసిడి నిల్వలను గణనీయంగా పెంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక మేరకు గతేడాది నవంబర్‌లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఏకంగా 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆ నెలలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) 8 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు డబ్ల్యూజీసీ తన నివేదికలో వెల్లడించింది. తద్వారా నవంబర్‌ నెలలో అత్యధిక బంగారు నిల్వలు కొనుగోలు చేసిన మూడో అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా ఆర్బీఐ నిలిచింది. ఆ నెలలో ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలు కొనుగోలు చేసిన దేశాల జాబితాలో పోలండ్, ఉజ్బెకిస్థాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఆర్బీఐ వద్ద 876 టన్నుల పసిడి నిల్వలు..

గత ఏడాది 2024లో నవంబర్‌ నెల వరకు ఆర్‌బీఐ మొత్తం 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ దగ్గరున్న మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరింది. 2024లో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసిన దేశంగా పోలండ్‌ నిలిచింది. పోలండ్ తర్వాత 2024లో అత్యధిక బంగారు నిల్వలు కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకుగా ఆర్‌బీఐ కావడం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్ని ఆర్థిక ఆనిశ్చితి పరిస్థితులు, యుద్ధ మేఘాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణనలోకి తీసుకొని వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి.

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత నవంబర్‌ నెలలో బంగారం ధరలు తగ్గాయి. దీన్ని బంగారం కొనుగోలుకు గొప్ప అవకాశంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు మలుచుకున్నాయి. భారీగా బంగారు నిల్వలను కొనుగోలు చేశాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారు నిల్వలు కొనుగోలు చేయడం ఓ రకంగా బంగారానికి డిమాండ్ పెంచడానికి దోహదపడ్డాయి.

21 టన్నులు కొనుగోలు చేసిన పోలండ్..

నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పోలండ్‌ (NBP) నవంబర్‌ నెలలో ఏకంగా 21 టన్నుల పసిడిని కొనుగోలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. 2024లో మొత్తంగా 90 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి తన మొత్తం నిల్వలను 448 టన్నులకు పెంచుకుంది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్థాన్‌ నవంబర్‌లో 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా తన బంగారు నిల్వలను 382 టన్నులకు పెంచుకుంది. అలాగే కజక్‌స్థాన్‌ 5 టన్నుల కొనుగోలతో తన బంగారు నిల్వలను 295 టన్నులకు పెంచుకుంది.

చైనా గోల్డ్ రిజర్వ్ ఎంతంటే..?

కాగా చైనా నవంబరు మాసంలో 5 టన్నులు కొనుగోలు చేసి తన బంగారు నిల్వలను 2,264 టన్నులకు పెంచుకుంది. మొత్తం బంగారం నిల్వల్లో 5 శాతం చైనా దగ్గరే ఉండటం విశేషం. జోర్డాన్‌ 4 టన్నులు, తుర్కియే 3 టన్నులు కొనుగోలు చేశాయి.