PNB Clients: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లను తగ్గించింది. 6.80 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 17 శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు చాలా బ్యాంకులు తమ గృహ రుణాలను రెపో రేటుకు లింక్ చేయడం ప్రారంభించాయి. దీంతో రెపో రేటు తగ్గినప్పుడు రుణగ్రహీతలు వెంటనే ప్రయోజనం పొందుతారు. రెపో రేటు అంటే RBI నుంచి బ్యాంకులు తీసుకునే రుణం రేటు.
PNB వినియోగదారులకు బహుమతి
దసరా, దీపావళికి ముందు చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. SBI తరువాత ఇప్పుడు PNB కూడా ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రెపో రేటు ఆధారంగా రుణాల వడ్డీ రేట్లు 6.55 శాతానికి తగ్గాయి. ఇది వినియోగదారులకు గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది. గృహ రుణ EMI 0.25%తగ్గిస్తారు.
ఈ బ్యాంకులు రుణాలను చౌకగా చేశాయి
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బిఐ పండుగ రుణ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజులను కూడా రద్దు చేసింది. SBI రుణ వడ్డీ రేట్లపై 0.05 శాతం తగ్గింపు ప్రకటించింది. ఇప్పుడు SBI కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా మారాయి. ఇది కాకుండా బ్యాంక్ రుణ రేటు (PLR) లో 5 బేసిస్ బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించింది. తర్వాత అది 12.20 శాతంగా ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) గృహ రుణాలు, ఆటో రుణాలపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించింది. దీని తరువాత గృహ రుణం 6.75 శాతానికి అందిస్తారు. ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేసింది. ప్రైవేట్ రంగ పెద్ద బ్యాంకు కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించింది. బ్యాంక్ ఇప్పుడు 6.50 శాతం చొప్పున గృహ రుణాన్ని అందిస్తోంది. ఈ గృహ రుణాలు నవంబర్ 8 వరకు రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.