Inheritance rights: సమాజంలో మహిళల పాత్రతో పాటు హక్కులు(property Rights) సైతం మారుతూనే ఉంటాయి. సామాజిక అవగాహన, అక్షరాస్యత రేటు(Literacy Rate) పెరగటంతో మహిళా సాధికారత విజయవంతంగా ముందుకు సాగుతోంది. పురషులతో సమానంగా మహిళలకు సమాజంలో సమాన హక్కులు ఉండేలా చూసేందుకు భారత న్యాయ వ్యవస్థ సైతం అనేక చట్టాల్లో మార్పులను తీసుకొచ్చింది. ఒక స్త్రీ ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా తన గురించి తాను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం సమాజంలో ఇప్పుడు చాలా కీలకంగా మారింది. వివిధ మతాల మహిళలకు చట్టపరంగా ఉండే వారసత్వ హక్కుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ మహిళల హక్కులు:
హిందూ వారసత్వ చట్టం-1956 ప్రకారం హిందు, జైన్, బౌద్ధ, సిక్కు మహిళలకు హక్కులు చెప్పబడ్డాయి. తల్లిదండ్రులు చనిపోతే ఆస్తిపై కుమారునికి ఏవిధమైన అధికారం ఉంటాయో కుమార్తెకు సైతం అంతే అధికారం ఉంటుంది. వివాహమై అత్తవారింటికి వెళ్లిపోయిన కుమార్తెకు సైతం పెళ్లికాని కూతురికి ఉండే హక్కులు ఉంటాయి. కుమారుడికి వర్తించే అధికారమే ఆమెకు లభిస్తుంది. పూర్వికుల ఆస్తిని పంచుకునే విషయంలో మహిళలకు సైతం సమానహక్కు ఉంటుందని ధర్మాసనం గతంలోనే స్పష్టం చేసింది.
ముస్లిం మహిళల హక్కులు:
ముహమ్మద్ చట్టం ప్రకారం పూర్వీకులు సంపాదించిన.. సొంతగా సంపాదించుకునే ఆస్తికి ఎటువంటి తేడా ఉండదు. ముస్లిం పర్సనల్ లా ద్వారా పాలించబడే ముస్లిం స్త్రీ.. పిల్లలు కలిగి ఉంటే ఆమె భర్త ఆస్తిలో 1/8వ వంతు వాటాను పొందేందుకు అర్హురాలు. లేకుంటే.. ఆమెకు 1/4వ వంతు వాటా లభిస్తుంది. ఒక ముస్లిం మహిళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పరిస్థితిలో కుమార్తెలు సైతం చట్టబద్ధమైన వారసుల అవుతారు. ఈ సందర్భంలో కుమార్తెకు.. కుమారుడికి వచ్చే వాటాలో సగం విలువైన వాటాను పొందేందుకు అర్హురాలు.
క్రిస్టియన్, పార్సీ, జూయిష్ మహిళల హక్కులు:
భారత వారసత్వ చట్టం- 1925 ప్రకారం క్రిస్టియన్ మహిళకు ముందుగా ఒప్పుకున్న అంగీకారం మేరకు ఆస్తిలో వాటా లభిస్తుంది. ఒకవేళ భర్త చనిపోయిన మహిళ అయితే 1/3వ వంతు వాటా ఆమెకు.. మిగిలినది సంతానానికి వెళుతుంది. ఒకవేళ పిల్లలు లేక ఇతర బంధువులు ఉంటే మెుత్తం ఆస్తిలో సగం వాటా లభిస్తుంది. ఎవరూ లేని సందర్భంలో పూర్తి వాటా ఆమెకు దక్కుతుంది. పార్సీ మహిళల విషయంలో పిల్లలతో సమానంగా ఆస్తిలో వాటా వస్తుంది. ఒకవేళ భర్త చనిపోయిన మహిళ అయితే తన పిల్లలకు, ఆమెకు సమాన వాటా లభిస్తుంది.
భారతదేశంలో ఉన్న అన్ని వారసత్వ చట్టాలను పరిశీలిస్తే.. చట్టసభ సభ్యులు స్త్రీ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రయత్నించారని తెలుస్తోంది. భార్య, తల్లి, కుమార్తె.. ఎవరైనా ఒక స్త్రీ తన ప్రియమైనవారి ఆస్తిలో కొంత వాటా పొందడానికి చట్టబద్ధంగా అర్హులని పైన వివరాలను బట్టి మనకు స్పష్టమవుతోంది.
ఇవీ చదవండి..
Facts about Tears: బాధ కలిగినపుడు కన్నీరు కాటుక కళ్లను దాటనివ్వండి! సైన్స్ ఏం చెబుతోందంటే..