
ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో పొందే ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాల్లో గ్రాట్యుటీ ఒకటి. అయితే గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగాలు మారుతూ ఉండే ఉద్యోగులు రూ.20 లక్షల పన్ను మినహాయింపు ప్రతి కంపెనీకి వేర్వేరుగా వర్తిస్తుందా? లేక మొత్తం కెరీర్‌కు ఒక్కసారేనా? అనే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. పన్ను నిపుణుల ప్రకారం ఈ మినహాయింపు ప్రతి యజమానికి విడిగా కాకుండా ఉద్యోగి మొత్తం కెరీర్‌కు కలిపి వర్తిస్తుంది.
గ్రాట్యుటీ అనేది యజమాని తన ఉద్యోగికి సేవలకు గుర్తింపుగా ఇచ్చే పదవీ విరమణ ప్రయోజనం. ఇది 1972 గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం కింద అమలులో ఉంటుంది. ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు, లేదా మరణం, అంగవైకల్యం వంటి పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. సాధారణంగా ఒకే సంస్థలో కనీసం ఐదు సంవత్సరాల నిరంతర సేవ పూర్తి చేసిన ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. అయితే నిర్ణీత కాల ఉద్యోగులు (FTEలు), కాంట్రాక్ట్ కార్మికులకు కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(10) ప్రకారం రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఇది ప్రతి ఉద్యోగానికి కొత్తగా లభించే పరిమితి కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక ఉద్యోగి గతంలో ఏదైనా సంస్థలో గ్రాట్యుటీ మినహాయింపును ఇప్పటికే వినియోగించుకుని ఉంటే, తదుపరి ఉద్యోగంలో మిగిలిన పరిమితి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మొదటి కంపెనీలో రూ.8 లక్షల గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు పొందాడనుకుందాం.
తర్వాత మరో సంస్థలో పదవీ విరమణ సమయంలో రూ.18 లక్షల గ్రాట్యుటీ పొందితే, అతనికి మిగిలిన మినహాయింపు రూ.12 లక్షలు మాత్రమే ఉంటుంది. అంటే మిగిలిన రూ.6 లక్షలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు తమ గత సంస్థల నుండి పొందిన గ్రాట్యుటీ, క్లెయిమ్ చేసిన పన్ను మినహాయింపుల వివరాలను భద్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ మార్పులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ అవగాహన ఎంతో అవసరమని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి