
ప్రయాణికులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. శుక్రవారం ఏకంగా దేశంలో మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఈ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు. ఇక ఈ మూడు కొత్త రైళ్లతో పాటు మరో నాలుగు కొత్త రైలు సర్వీసులను మోదీ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం జరగనుంది. ఈ రైళ్ల వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్లపల్లి-తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ ట్రైన్‌తో పాటు తిరువనంతపురం-తాంబరం, నాగర్ కోయిల్-మంగళూరు అమృత్ భారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. చర్లపల్లి-తిరువనంతపురం రైలు తెలుగు రాష్ట్రాల గుండా ప్రయణించనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉండనుంది. ఈ రైళ్లు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచుతామిన రైల్వేశాఖ తెలిపింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
చర్లపల్లి-తిరువనంతపురం(17041) రైలు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. ఇక తర్వాతి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరువనంతపురంలో ప్రతీ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరుతుంది. తర్వాతి రోజు గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుటుందని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ రైలు చర్లపల్లి నుంచి బయల్దేరి నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తమిళనాడు, కేరళకు వెళుతుంది. ఈ రైలులో స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాాటులో ఉంటాయి.
ప్రస్తుతం చర్లపల్లి-ముజర్ ఫర్ మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది. ఇప్పుడు మరో రైలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే చర్లపల్లి-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ రైల్లో పలు ప్రత్యేకలు ఉన్నాయి. ఇందులో ఆర్ఏసీ టికెట్లు ఉండవు. ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కూడా ఉండవ్, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నవారు మాత్రమే ఇందులో ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక ఈ రైల్లో ఏసీ కోచ్‌లు ఉండవు. స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఇందులో 8 స్లీపర్, 11 సెకండ్ క్లాస్, దివ్యాంగుల కోసం 2 సెకండ్ క్లాస్, ఒక ప్యాంట్రీ కార్ కోచ్‌లు ఉంటాయి. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ రైలు పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.