
నేటి కాలంలో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి అనేక మార్గాలు ఉన్నప్పటికీ సామాన్యులు ఇప్పటికీ పోస్టాఫీస్ పథకాలనే ఎక్కువగా నమ్ముతారు. దానికి కారణం ప్రభుత్వ గ్యారెంటీ, పెట్టుబడికి ఉండే పూర్తి భద్రత. తాజాగా పోస్టాఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ లక్షాధికారి కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది ఒక చిన్న పొదుపు పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది. కాబట్టి మీ డబ్బుకు 100శాతం భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మీరు డిపాజిట్ చేసిన సొమ్ముపై ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన వడ్డీ లభిస్తుంది.
ఈ పథకంలో కేవలం రూ.100తోనే ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 6.7శాతం వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇందులో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. దీనివల్ల మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత మీ డిపాజిట్‌పై 50 శాతం వరకు తక్కువ వడ్డీకే రుణం పొందే వెసులుబాటు ఉంది.
మీరు రోజుకు రూ. 200 పొదుపు చేయగలిగితే అది నెలకు రూ. 6,000 అవుతుంది.
మొదటి 5 ఏళ్లు: నెలకు రూ. 6,000 చొప్పున 5 ఏళ్లలో మీరు చెల్లించే మొత్తం రూ. 3,60,000. 6.7శాతం వడ్డీతో కలిపి మీ చేతికి రూ. 4,28,197 వస్తాయి.
మరో 5 ఏళ్ల పొడిగింపు: మీరు ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు (మొత్తం 10 ఏళ్లు) కొనసాగిస్తే మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 7,20,000 అవుతుంది.
మెచ్యూరిటీ మొత్తం: 10 ఏళ్ల తర్వాత చక్రవడ్డీతో కలిపి మీకు సుమారు రూ. 10,25,131 అందుతాయి.
కేవలం రోజుకు రూ. 200 పొదుపు చేయాలనే క్రమశిక్షణ ఉంటే పదేళ్లలో మీ చేతిలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉంటుంది.
సాధారణంగా ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. అయితే మీకు అత్యవసరంగా డబ్బు కావాలంటే 3 ఏళ్ల తర్వాత ఖాతాను క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల చదువులకైనా, పెళ్లిళ్లకైనా లేదా రిటైర్మెంట్ ప్లాన్ కోసమైనా.. రిస్క్ లేకుండా డబ్బు దాచుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ RD ఒక అద్భుతమైన వరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..