
ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్‌లో బ్యాంక్ లాకర్‌లో బంగారం మాయమైందన్న ఆరోపణలతో ఒకసారి కలకలం రేగింది. ఒక మహిళ, ఆమె అత్తగారు తమ లాకర్‌లో ఉంచిన బంగారం కనిపించలేదని చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. దీనితో ఇతర లాకర్ హోల్డర్లు కూడా తమ వస్తువులు చెక్ చేసేందుకు బ్యాంక్ వద్దకు చేరుకోవడంతో భారీ గందరగోళం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. లాకర్లు పగలగొట్టిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. తదుపరి విచారణలో మహిళలకు ఉమ్మడి లాకర్ ఉందని, అది ఇటీవల ఫిబ్రవరి 5న నిర్వహించబడిందని వెల్లడైంది. పెద్ద ఎత్తున దొంగతనం జరిగిందన్న వార్తలు కేవలం పుకార్లేనని పోలీసులు స్పష్టం చేశారు. బ్యాంకు భద్రతలో ఎలాంటి లోపం కనిపించలేదని తెలిపారు.
చాలామంది అనుకునేలా బ్యాంక్ లాకర్‌లో ఉన్న వస్తువులకు బ్యాంక్ పూర్తి బాధ్యత వహించదు. బ్యాంకులు కేవలం నిల్వ సౌకర్యం మాత్రమే అందిస్తాయి. లాకర్‌లో ఏమి ఉంచారో వారు రికార్డు కూడా ఉంచరు. RBI నిబంధనల ప్రకారం బ్యాంక్ బాధ్యత తమ నిర్లక్ష్యం నిరూపితమైతే మాత్రమే ఉంటుంది.
2022 RBI నియమాల ప్రకారం.. బ్యాంక్ తప్పిదం వల్ల నష్టం జరిగితే వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు మాత్రమే పరిహారం. లాకర్ అద్దె రూ.4,000 అయితే గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే. లాకర్‌లో కోట్ల విలువ వస్తువులు, బంగారం, దస్తావేజులు ఉన్నా కూడా అంతే ఇస్తారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు బ్యాంక్ బాధ్యత ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి