
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 23వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. గత నెల 20వ తేదీన ప్రధాని మోదీ స్వయంగా తన చేతుల మీదుగా డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఇవి పడగా.. కొంతమంది రైతులకు ఇంకా జమ కాలేదు. సాంకేతిక కారణాలతో నిధులు పొందలేనివారు సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెబుతోంది. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈకేవైసీ పూర్తి చేయడం, బ్యాంక్ రికార్డులు తనిఖీలు చేయడం, పట్టాదారు పాస్‌బుకుల్లో తప్పులు సరిదిద్దుకోవడం లేదా ఇతర సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల వెంటనే సొమ్ము అకౌంట్లో పడుతుంది. డబ్బులు పడనివారు పీఎం కిసాన్ పోర్టల్ లేదా సమీపంలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి సమస్య ఏంటనేది తెలుసుకుని పరిష్కరించుకోవాలని కేంద్రం పేర్కొంది.
అయితే 23వ విడత ప్రక్రియ పూర్తి చేయగా.. 24వ విడత ఎప్పుడు జమ అవుతుందనే విషయంపై చర్చ నడుస్తోంది. అయితే తర్వాతి విడత నిధులు అక్టోబర్‌లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి మోదీ సర్కార్ డబ్బులు రిలీజ్ చేస్తోంది. జూన్‌లో 23 విడత విడుదల చేయడంతో.. నాలుగు నెలల తర్వాత అక్టోబర్‌లో తర్వాతి ఇన్‌స్టాల్‌మెంట్ వేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కూడా పంపిణీ చేస్తుండగా.. వీటిని నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా ఇస్తున్నారు. ఏప్రిల్ నుంచి జులై వరకు, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు, డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడు విడతలుగా వీటిని అందిస్తున్నారు.
అయితే ఈ నగదు అందుకోవాలంటే ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసి ఉండాలి. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదై 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. ఇక ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ కూడా తప్పనిసరి. ఇవన్నీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ నగదు ఎలాంటి అవాంతరాలు లేకుండా అందుతుంది. వీటిల్లో ఏమైనా పెండింగ్‌లో వీటినే సొమ్ము నిలిచిపోతుంది. మళ్లీ పూర్తి చేసిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. దీంతో ఈకేవైసీ ప్రతీఒక్కరూ పూర్తి చేయాలని లబ్దిదారులకు కేంద్రం సూచిస్తోంది.