Factheck: మే 14 నుంచి పెట్రోల్‌ బంక్‌లు బంద్‌? ఇందులో నిజమెంతా?

మే 14, 2025 నుండి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారనే వార్త పూర్తిగా అసత్యం. వైరల్ అవుతున్న వీడియో పాత వార్తా కథనం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో డీలర్ల ప్రతిపాదన ఉపసంహరించబడింది. ఇది కేవలం ఫేక్ న్యూస్.

Factheck: మే 14 నుంచి పెట్రోల్‌ బంక్‌లు బంద్‌? ఇందులో నిజమెంతా?
Petrol Pump Closure

Updated on: May 12, 2026 | 6:44 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 14 మే 2025 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారు అనే వార్త ఫేక్‌ అని తేలింది. వైరల్ అవుతున్న వీడియో కొత్తది కాదు.. అది 2017 నాటి పాత ఈటీవీ వార్తా కథనం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయాలనే నిర్ణయం తీసుకోలేదు. వైరల్ వీడియోలో పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారని పేర్కొన్నారు. అయితే దీనిపై తాజా అధికారిక ప్రకటనలు, నోటిఫికేషన్లు ఏవీ రాలేదు.

అయితే 2017 ఏప్రిల్‌లో ప్రచురితమైన పలు వార్తా కథనాలు కొన్ని బయటపడ్డాయి. ఆ సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చమురు వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఆ నేపథ్యంలో భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం ఎంపిక చేసిన ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, హర్యానా ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయాలని ప్రతిపాదించింది.

అయితే ఆ నిర్ణయం అమల్లోకి రాకముందే ఉపసంహరించుకున్నారు. మొదట కమిషన్ పెంపు కోసం సమ్మెగా ప్రకటించిన ఈ నిర్ణయాన్ని, తర్వాత ఇంధన పరిరక్షణకు అనుసంధానం చేసినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. వైరల్ వీడియో అసలు మూలం కూడా గుర్తించబడింది. ప్రస్తుతం దాన్ని కొత్తదిగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అందువల్ల 14 మే 2025 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవు అనే వాదన పూర్తిగా అసత్యం. వైరల్ అవుతున్న వీడియో పాతది మాత్రమే, ప్రస్తుతానికి అలాంటి నిర్ణయం ఎక్కడా అమల్లో లేదు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us