పెట్రోల్, డీజిల్ ధరల్లో చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $ 123 స్థాయికి చేరుకుంది. రష్యా తమ చమురును భారత్‌కు 30% తగ్గింపుతో విక్రయిస్తోంది. దీన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటూ రష్యా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా రష్యా భారత్‌కు రెండో అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. దీంతో స్థానికంగా ధరలు పెరగడం ఆగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28గా విక్రయిస్తున్నారు. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. ఇది కాకుండా కోల్‌కతాలో ఈరోజు పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. దేశంలోని 4 మహానగరాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చి చూస్తే, చమురు ధరలు ముంబైలో అత్యధికంగా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.76గా ఉంది.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత దేశంలోని రిఫైనింగ్ కంపెనీలు భారీ తగ్గింపులతో లభించే రష్యా ముడి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయని పరిశ్రమ డేటా ప్రకారం తెలుస్తుంది. మే నెలలో భారతీయ రిఫైనింగ్ కంపెనీలు దాదాపు 25 మిలియన్ బ్యారెళ్ల రష్యా క్రూడ్‌ను కొనుగోలు చేశాయి. భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో ఇది 16 శాతం. ఏప్రిల్‌లో తొలిసారిగా భారత్ సముద్రం ద్వారా జరిగే మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 5 శాతానికి చేరుకుంది. మేలో ఇరాక్ భారతదేశం అగ్ర సరఫరాదారుగా కొనసాగింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న తరుణంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుకునేందుకు భారత్ మినహాయింపులను సద్వినియోగం చేసుకుంది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. భారత్ తన చమురులో 27 శాతం ఇరాక్ నుంచి, 17 శాతం సౌదీ అరేబియా నుంచి, 13 శాతం యూఏఈ నుంచి దిగుమతి చేసుకునేది. అయితే, ఇప్పుడు సౌదీ అరేబియా స్థానంలో రష్యా వచ్చి చేరింది.