
ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌వో అకౌంట్ అనేది ఉంటుంది. ప్రతీ నెలా ఉద్యోగి అందుకునే శాలరీతో కొత్త మొత్తంతో పాటు యాజమాన్యాలు మరికొంత యాడ్ చేసి ఈ ప్రత్యేక అకౌంట్‌లో జమ చేస్తూ ఉంటాయి. ఉద్యోగికి ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించేందుకు పీఎఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా అనివార్య పరిస్ధితుల్లో ఉద్యోగం కోల్పోయినప్పుడు కూడా ఈ సొమ్ము సహయపడుతుంది. అయితే ఈపీఎఫ్‌వో పరిధిలో లేని ఉద్యోగుల కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త స్కీమ్‌ను 2025లో తీసుకొచ్చింది. అదే ఎంప్లాయి ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్-2025. పీఎఫ్ అకౌంట్ లేనివారికి ఈ కొత్త పథకం ఎలా ఆర్ధిక భరోసా కల్పిస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జులై 2017 నుంచి అక్టోబర్ 2025 మధ్య ఈపీఎఫ్ కవరేజ్ నుంచి తొలగించబడ్డ లేదా చేరని అర్హత గల ఉద్యోగులను యాజమాన్యాలు నమోదు చేయడానికి ఈపీఎఫ్‌వో ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇది స్వచ్చంధ పథకం. అంటే కంపెనీలు స్వచ్చంధంగా ఇందులో చేరవచ్చు. ఇందులో నమోదు చేసుకోవడానికి యాజమాన్యాలకు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు సమయం ఇచ్చారు. ఈపీఎఫ్ ప్రయోజనాలను దూరమైన ఉద్యోగులను ఈ స్కీమ్‌లో చేర్చవచ్చు. గతంలో నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలు కేవలం రూ.100 జరిమానా చెల్లించి ఇందులో చేరవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌తో సంబంధం లేకుండా ఏ సంస్థ అయినా ఇందులో చేరవచ్చు.
ఈ స్కీమ్‌లో యజమానులకు అనేక వెసులుబాటు ప్రకటించింది. ఉద్యోగి వంతు చందాను కోతపెట్టనప్పుడు.. యజమానులు తన వంతు చందాతో పాటు వడ్డీని జమ చేస్తే సరిపోతుంది. అంటే ఉద్యోగి వంతు వాటాను చెల్లించాల్సిన అవసరం లేకుండా కంపెనీలకు మినహాయింపు ఇస్తుంది. దేశవ్యాప్తంగా పనిచేసే ఉద్యోగులుందరికీ సామాజిక, ఆర్ధిక బాధ్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్‌వో ఈ పథకం 2025లో ప్రవేశపెట్టింది.