
ఆధార్ కార్డుదారులకు యూఐడీఏఐ అలర్ట్ జారీ చేసింది. ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోవడానికి కొత్త నిబంధనలు జారీ చేసింది. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక నుంచి ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు మార్చుకోవాలంటే చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఆధార్ కార్డులో నేమ్, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు మార్చుకోవాలంటే స్పష్టమైన, నిర్దిష్టమైన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులు దుర్వినియోగం అవ్వకుండా పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండే లక్ష్యంతో యూఐడీఏఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త రూల్స్ ఇలా ఉన్నాయి.
ఒక వ్యక్తి ఒకే ఆధార్ కలిగి ఉండాలి. ఒకవేళ రెండు ఆధార్ కార్డులు కలిగి ఉంటే బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మిగతా ఆధార్ కార్డులను చెల్లనివిగా పరిగణిస్తారు. ఆధార్ డేటా బెస్ నుంచి కూడా నికిలీ ఆధార్ నెంబర్లను తీసివేస్తారు.
ఆధార్ కార్డులోని వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితమైన రుజువు ఇక నుంచి చూపించాల్సి ఉంటుంది. పేరు, ఫొటోగ్రాఫ్ స్పష్టంగా కనిపించేలా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు పత్రం అందించాల్సి ఉంటుంది. పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర ధృవీకరణ పత్రాలను అందించాల్సి ఉంటుంది. అడ్రస్ మార్చుకోవాలంటే కరెంట్, వాటర్, గ్యాస్, ల్యాండ్ లైన్ వంటి యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, రిజిస్టర్డ్ అద్దె ఒప్పందాలు వంటి పత్రాలలో ఏదైనా అందించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వాలు జారీ చేసి అధికారిక నివాస ధృవీకరణ పత్రాలను కూడా అడ్రస్ మార్చుకోవడానికి ఉపయోగపడతాయి.
ఇక పుట్టిన తేదీ మార్చుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పాస్ పోర్ట్ వంటి రుజువు పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడనున్నాయి. ఆఫ్ లైన్ ద్వారా ఆధార్ సెంటర్లు లేదా యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా మీరు ఈ డాక్యుమెంట్స్ సమర్పించి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అయితే బయోమెట్రిక్ వివరాలను మాత్రమే అప్ డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మీరు దగ్గరల్లోని ఏదైనా ఆధార్ కేంద్రం ద్వారా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.