సామాన్యుడి జేబుకు ఇక పండగే.. పార్లమెంట్ నిర్ణయాలతో మారనున్న ఫైనాన్షియల్ లెక్కలు!

పార్లమెంటు వేదికగా సామాన్య పౌరుడి ఆర్థిక ప్రయాణాన్ని మార్చేసేలా సరికొత్త చట్టాలు రూపుదిద్దుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేరుగా మీ పొదుపుపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం ..

సామాన్యుడి జేబుకు ఇక పండగే.. పార్లమెంట్ నిర్ణయాలతో మారనున్న ఫైనాన్షియల్ లెక్కలు!
Finance.

Updated on: Dec 21, 2025 | 12:38 PM

పార్లమెంటు వేదికగా సామాన్య పౌరుడి ఆర్థిక ప్రయాణాన్ని మార్చేసేలా సరికొత్త చట్టాలు రూపుదిద్దుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేరుగా మీ పొదుపుపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఉన్న పరిమితులను సడలిస్తూ విదేశీ పెట్టుబడులకు 100 శాతం పచ్చజెండా ఊపారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం వినియోగదారులకు తక్కువ ధరకే మెరుగైన సేవలు అందించడం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు భారత్‌లోకి నేరుగా అడుగుపెట్టడం వల్ల దేశీయ కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది. ఫలితంగా మీరు చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట అని చెప్పాలి.

ఇన్సూరెన్స్ నుంచి మ్యూచువల్​ ఫండ్స్​ వరకు..

కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సంపద సృష్టించుకోవాలని భావించే వారికి కూడా అద్భుతమైన వార్త అందింది. సెబీ నిబంధనల్లో కీలక మార్పులు చేయడం ద్వారా ఎక్స్‌పెన్స్ రేషియోను తగ్గించే దిశగా అడుగులు పడ్డాయి. దీనివల్ల ఏటా మీరు కట్టే ఫీజుల భారం తగ్గుతుంది. చిన్న మొత్తంలో కనిపించినా, 15 నుంచి 20 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఈ మార్పు మీ చేతికి అందే లాభాల్లో లక్షల రూపాయల తేడాను చూపిస్తుంది. అంటే మీ కష్టార్జితం మధ్యవర్తుల పాలు కాకుండా నేరుగా మీ ఖాతాలోకే చేరుతుంది.

ఇక వృద్ధాప్య భరోసా ఇచ్చే పెన్షన్ ఫండ్స్ విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పింఛను మొత్తాన్ని మార్కెట్ అనుసంధిత పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ సమయానికి భారీ నిధిని సమకూర్చుకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో ఉన్న పరిమితుల వల్ల వడ్డీ రేట్లు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. పీఎఫ్ఆర్డీఏ చట్టంలో మార్పులు సామాన్యుడి రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా నిలుస్తాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి రక్షణ కల్పించడానికి కొత్త సెక్యూరిటీస్ కోడ్ అమలులోకి వస్తోంది. ఇన్వెస్టర్ల సొమ్ముకు భద్రత కల్పించడమే కాకుండా మోసగాళ్లపై ఉక్కుపాదం మోపేలా కఠిన నిబంధనలు రూపొందించారు.

చివరగా విద్యుత్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచడం ద్వారా దీర్ఘకాలంలో విద్యుత్ చార్జీల భారం తగ్గే వీలుంది. అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలు రావడం వల్ల ఇంధన రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. ఈ మార్పులన్నీ క్రమంగా అమలులోకి వస్తే సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా ఆర్థికంగా మరింత స్థిరత్వం లభిస్తుంది.