Paytm IPO: మీరు పేటీఎం ఐపీఓ(Paytm IPO) కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పేటీఎం ఐపీఓ నవంబర్ మొదటి వారంలో అంటే నవంబర్ 8న పెట్టుబడుల కోసం స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానుంది. పేటీఎం ఐపీఓ ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ అవ్వనుంది. గతంలో ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా రూ. 15 వేల కోట్ల ఐపీవోతో లిస్టింగ్ అయింది. Paytm సంస్థ 2000 సంవత్సరంలో విజయ్ శేఖర్ శర్మ స్థాపించారు. 2010లో కంపెనీ మొబైల్ రీఛార్జ్ సేవను ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ తన సేవల పరిధిని నిరంతరంగా పెంచుకుంటూనే ఉంది. ప్రస్తుతం పేటీఎం యాప్ సహాయంతో, హోటల్ బుకింగ్, రైలు, విమానం టిక్కెట్‌తో సహా ప్రతిదీ చేసుకునే సౌలభ్యం ఉంది.
పేటీఎం రూ.18,300 కోట్లతో లిస్టింగ్ కానుంది. దీంతో ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద IPO కానుంది. 2010లో రూ. 15,000 కోట్ల IPOతో మార్కెట్‌లోకి వచ్చిన కోల్ ఇండియా లిమిటెడ్ పేరిట ఇప్పటివరకు ఈ రికార్డు ఉంది.
మీడియా నివేదికల ప్రకారం, పేటీఎం మాతృ సంస్థ వన్97 (One97) కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఐపీవో నవంబర్ 8 న ప్రారంభం కానుంది. చివరి తేదీ నవంబర్ 10గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్‌లో నవంబర్ 18న లిస్టింగ్ చేసే అవకాశం ఉంది.
ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడిదారులు ఈ కంపెనీపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనా బిలియనీర్ జాక్ మా కంపెనీ యాంట్ ఫైనాన్షియల్ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టింది.
ఇవి కాకుండా, అలీబాబా సింగపూర్, ఎలివేషన్ క్యాపిటల్‌కు చెందిన మూడు ఫండ్స్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి.
గ్రే మార్కెట్‌లో భారీ ప్రీమియం..
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం పేటీఎం ప్రస్తుతం అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో రూ.3300-3400 స్థాయిలో ట్రేడవుతోంది.
పేటీఎం ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఉన్న ధరల కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే పేటీఎం అన్‌లిస్టెడ్ ధర తగ్గవచ్చు. ఇదే కాకుండా అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో అధిక రేట్లు కారణంగా షేర్ల ట్రేడింగ్ పరిమాణం తగ్గనుంది.
పేటీఎం షేర్లు గత 3 సంవత్సరాలుగా అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, పేటీఎం తన ప్రస్తుత వ్యాపార శ్రేణిని విస్తరించడానికి, నెట్‌వర్క్‌లో కొత్త వ్యాపారులు, కస్టమర్‌లను చేర్చేందుకు ఐపీవో ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగించనుంది.