
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ఊరట లభించింది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాదారులు కనీస పెన్షన్ రూ.వెయ్యి పొందుతుండగా.. దీనిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో దీనిపై ఆందోళనలు చేయడతో పాటు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇక ఇటీవల సుప్రీంకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగింది. ఈ డిమాండ్ల వేళ కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ పరిమితిని పెంచుతుందనే వార్తలు వస్తుండగా.. కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో ఆ వార్తలను ఖండించింది. అయితే ఈ క్రమంలో పెన్షన్ పరిమితిపై ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట చెందే వార్త బయటకు వచ్చింది. అదేంటి అనేది చూద్దాం.
ఈపీఎఫ్‌వో చందాదారులకు కనీస పెన్షన్ లిమిట్ పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ఈపీఎస్-1995 కింద పెన్షన్ పరిమితిని పెంచాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచనలు చేసింది. లేబర్, టెక్స్‌టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 5వ రిపోర్ట్ సమర్పించింది. ఈ నివేదికలో ఈపీఎఫ్‌వో సబ్‌స్కైబర్లకు కనీస పెన్షన్ పరిమితిని పెంచాలని, ఎప్పటినుంచో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చాలని సూచించింది. పెన్షన్ సరిపోవడం లేదని, వాటిని రూ.7,500 పెంచాలని ఇటీవల ఢిల్లీలో ఉద్యోగ, పెన్షన్ సంఘాలు నిరసనలు కూడా చేపట్టాయి. మూడు రోజుల పాటు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో పార్లమెంటరీ స్థాయి సంఘం స్పందించి కేంద్రానికి సూచనలు సమర్పించింది. ఉద్యోగులు వినతి పత్రాలు, విజ్ఞాపనలు పలుమార్లు ఇచ్చినట్లు గుర్తు చేసింది. ప్రస్తుతం ఖర్చులు పెరగడం, జీవన వ్యయాలు పెరుగుతున్న క్రమంలో పెంచాలని కోరింది.
ఇక కేంద్రం గత నవంబర్‌లో కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌ను పార్లమెంటరీ ప్యానెల్ ఆహ్వానించింది. కొత్త లేబర్ కోడ్స్ అమలుపై శాశ్వత కో ఆర్డినేషన్, ఇంటరాక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక వర్క్ ప్లేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు పరిహారం అందించాలని స్పష్టం చేసింది. ఇక సామాజిక భద్రత ప్రయోజనాలను మెరుగుపర్చేందుకు ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని వెంటనే సవరించాలని సూచించింది. కాగా ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రిటైర్మెంట్ తర్వాత నెలకు కనీసం రూ.వెయ్యి పెన్షన్ పొందే అవకాశముంది. గత దశాబ్దం పైనుంచి ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఖర్చులు పెరుగుతుండటంతో పెన్షన్ సొమ్ము సరిపోవడం లేదు. దీంతో పెన్షన్ పరిమితి పెంచడం వల్ల 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరుతుంది. మరి కేంద్రం నుంచి ఎలాటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.