
ఇటీవల ఆర్ధిక మెసాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది సైబర్ మోసగాళ్లు ఇతరుల ఆధార్, పాన్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు. పాన్ కార్డు సాయంతో రుణాలు తీసుకుంటున్నారు. ఆధార్, పాన్ లాంటి వ్యక్తిగత ధృవీకరణ పత్రాలను ఎక్కడబడితే అక్కడ ఇవ్వకూడదని ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మోసగాళ్లు ఈ పత్రాలతో దుర్వినియోగానికి పాల్పడే అవకాశముంది. దీంతో మీ పాన్ కార్డును ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయాలు చూద్దాం.
మీ క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. దీనిని మీరు అలవాటు చేసుకోవాలి. సిబిల్ వెబ్ సైట్ ద్వారా ఏడాదికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందవచ్చు. ఇక బ్యాంకింగ్, ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థల నుంచి కూడా క్రెడిట్ రిపోర్ట్ ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. మీ పాన్, మొబైల్ నెంబర్ ఉపయోగించి క్రెడిట్ రిపోర్ట్ చూసుకోవచ్చు. క్రెడిట్ రిపోర్టులో మీరు తీసుకున్న రుణాలు అన్నీ కనిపిస్తాయి. మీకు సంబంధం లేకుండా ఏదైనా లోన్ తీసుకున్నట్లు కనిపిస్తే వెంటనే క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయండి. మీ పాన్ నెంబర్ ఉపయోగించి ఎవరైనా రుణం తీసుకున్నట్లు మీకు అనిపిస్తే బ్యాంక్‌కి వెళ్లి ఫిర్యాదు చేయండి. దీని వల్ల బ్యాంక్ సిబ్బంది చర్యలు తీసుకుంటారు.
మీ పాన్ కార్డుపై వేరేవారు రుణం తీసుకుంటే.. పాన్ నెంబర్ మీదే కాబట్టి మీరే రుణం కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా భారీగా తగ్గుతుంది. దీని వల్ల మీకు భవిష్యత్తులో రుణాలు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో మీరు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాన్ కార్డు ఎవరికైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాన్ కార్డు కాపీలను ఎవరికి పడితే వారికి ఇబ్బకూడదు. సైబర్ నేరగాళ్లు మీ పేరుపై నకిలీ పాన్ కార్డులు సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశం కూడా ఉంది. దీంతో మీ పాన్ కార్డు ద్వారా జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు క్రెడిట్ రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోండి.