
మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే, పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం మంచి పథకం. దీనిలో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చు తగ్గుల నుండి కూడా రక్షణ ఉంటుంది. ఈ పథకం ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.7 శాతం అందిస్తోంది. దీనిలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల తర్వాత మీకు రూ.14.49 లక్షలు లభిస్తాయి. అంటే వడ్డీ ద్వారానే రూ.4.5 లక్షలు సంపాదించవచ్చు.
NSC మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. మీరు కనీసం రూ.1,000 తో దీనిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పెట్టుబడికి లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. పైగా ఇందులో పన్ను మినహాయింపు కూడా పొందుతారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మీరు సంవత్సరానికి రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ప్రతి సంవత్సరం జోడించిన వడ్డీని కూడా తిరిగి పెట్టుబడిగా పరిగణిస్తారు.
ఈ ఖాతాను నివాసి భారతీయుడు మాత్రమే తెరవగలరు. మీరు వ్యక్తిగత లేదా ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి స్వంత పేరుతో NSC ఖాతాను కూడా తెరవవచ్చు. అయితే, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుతో తల్లిదండ్రులు ఖాతాను తెరవవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి