దుమ్మురేపిన నవంబర్ టూ వీలర్ సేల్స్.. పెట్రోల్, ఈవీ విభాగాల్లో తోపు ఎవరంటే?
దేశీయ టూ-వీలర్ మార్కెట్ మళ్లీ టాప్ గేర్‌లోకి దూసుకొచ్చింది. డిసెంబర్‌లో రాబోయే ధరల పెరుగుదల కంటే ముందే మంచి డీల్స్ సొంతం చేసుకోవాలని కస్టమర్లు భావిస్తుండటంతో నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో వాహన రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నవంబర్ నెలలో బ్రాండ్ల వారీగా ఏ కంపెనీ ఎన్ని వాహనాలు విక్రయించిందో తెలుసుకుందాం...

దేశీయ టూ-వీలర్ మార్కెట్ మళ్లీ టాప్ గేర్‌లోకి దూసుకొచ్చింది. డిసెంబర్‌లో రాబోయే ధరల పెరుగుదల కంటే ముందే మంచి డీల్స్ సొంతం చేసుకోవాలని కస్టమర్లు భావిస్తుండటంతో నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో వాహన రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. తాజా ‘వాహన్’ (Vahan) రిటైల్ డేటా ప్రకారం.. నవంబర్ 26 నాటికే దేశవ్యాప్తంగా ఏకంగా 28.6 లక్షల టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ నెల మొత్తం నమోదైన 23.3 లక్షల విక్రయాలతో పోలిస్తే ఇది ఇప్పటికే భారీగా పెరిగింది.
అంతే కాకుండా ఆర్‌టీవో పోర్టల్‌లో పూర్తిస్థాయి డేటా అప్‌లోడ్ అయ్యేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ అమ్మకాల్లో పెట్రోల్ బైకులకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా.. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు కూడా గణనీయంగా పుంజుకోవడం గమనార్హం. ముఖ్యంగా పెట్రోల్ బైక్‌ల విభాగంలో హీరో మోటోకార్ప్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్‌లో టీవీఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. నవంబర్ నెలలో బ్రాండ్ల వారీగా ఏ కంపెనీ ఎన్ని వాహనాలు విక్రయించిందో తెలుసుకుందాం…
నవంబర్ 2026 సేల్స్ రికార్డ్స్..
1. హీరో..
దాదాపు 10.19 లక్షల రిజిస్ట్రేషన్లతో ఓవరాల్ మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. నాన్-ఈవీ (పెట్రోల్) విభాగంలో 37.1 శాతం మార్కెట్ వాటాతో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
2.హోండా..
సుమారు 7.21 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
3.టీవీఎస్..
దాదాపు 5.32 లక్షల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది.
4.బజాజ్..
సుమారు 2.79 లక్షల యూనిట్ల సేల్స్‌తో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇక వీటి తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్, సుజుకి, యమహా సంస్థలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఎలక్ట్రిక్ టూ-వీలర్ సేల్స్ రికార్డ్స్..
నవంబర్ 27 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 1,92,388 ఎలక్ట్రిక్ టూ-వీలర్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొత్తం టూ-వీలర్ విక్రయాల్లో ఈవీల వాటా 6.4 శాతంగా నమోదైంది. ఈ విభాగంలో టీవీఎస్ అగ్రస్థానంలో నిలవగా.. ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 9,893 ఎలక్ట్రిక్ టూ-వీలర్ రిజిస్ట్రేషన్లు నమోదవ్వగా.. ఏపీలో 7,825 ఈవీ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
