నాకు ఆ హీరోకు మధ్య జరిగింది ఇదే.. నంబర్ వన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు
ప్రముఖ నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, సహనటుడు రాజశేఖర్‌తో అనుబంధం, జాతకాలు, దైవంపై తన దృక్పథంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం తామిద్దరం మంచి స్నేహితులమని, ఇటీవల ఒక కార్యక్రమంలో జీవిత గారితో కలిసి వారిని కలిశానని, మాట్లాడానని సుమన్ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. గతంలో సాయి కుమార్ వాయిస్ విషయంలో సుమన్, రాజశేఖర్ మధ్య గొడవలు వచ్చాయనే ప్రచారంపై వివరణ ఇచ్చారు. సాయి కుమార్ తన సినిమాల వల్లనే పాపులర్ అయ్యారని, అప్పట్లో తమిళ్ డబ్బింగ్‌కు వేరొకరికి వాయిస్ ఇచ్చేవారని, అయితే తన సినిమాల తర్వాతే సాయి కుమార్‌కు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. సాయి కుమార్ కన్నడలో హీరోగా బిజీగా మారడంతో డబ్బింగ్‌లు తగ్గించారని, అప్పుడు సాయి కుమార్ తనకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారని సుమన్ చెప్పారు. ఈ విషయంలో సాయి కుమార్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని, వారిద్దరూ రాజశేఖర్‌కు ఏం చెప్పారో తనకు తెలియదని, అయితే తనకీ, సాయి కుమార్‌కీ, రాజశేఖర్‌కీ మధ్య మంచి స్నేహం ఉందని సుమన్ పేర్కొన్నారు. వాయిస్ విషయంలో నిర్మాతలదే తుది నిర్ణయమని, క్యారెక్టర్, టోన్‌ను బట్టి ఎవరితో వాయిస్ చెప్పించాలనేది ఉంటుందని, అవార్డుల కోసం తాను వెంపర్లాడనని అన్నారు.
సుమన్ తన సినీ ప్రవేశం గురించి మాట్లాడుతూ, తాను బలవంతంగా సినిమా రంగంలోకి వచ్చానని, నటుడిగా మారాలనే ఆశ తనకు లేదని తెలిపారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లలేదని, నిర్మాతలను, దర్శకులను కలవడానికి వెళ్లలేదని అన్నారు. మార్షల్ ఆర్ట్స్‌తో తన ప్రయాణం మొదలైందని, అక్కడి నుంచి నటుడిగా మారడం జరిగిందని వివరించారు. కొన్నిసార్లు రొటీన్ వర్క్, డైలాగులు, ఫైట్లు విసుగు తెప్పించేవని ఆయన ఒప్పుకున్నారు. నేటి భారతం వంటి హిట్ చిత్రాల తర్వాత తనకు గ్యాప్ వచ్చిందని, రాజశేఖర్‌కు అంకుశం, మగాడు వంటి బ్లాక్‌బస్టర్‌లు వచ్చాయని, ఆ సినిమాలు సుమన్ చేయాల్సిందనే టాక్ వచ్చిందని అడిగినప్పుడు, తాను నంబర్ వన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని సుమన్ స్పష్టం చేశారు. పోటీ పడటం తన స్వభావం కాదని, ఎవరు ఎవరినీ ఆపలేరని, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని, పనితీరును మెరుగుపరుచుకోవడమే ముఖ్యమని ఆయన చెప్పారు.
తనపై చేతబడి జరిగిందనే అంశంపై సుమన్ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. కేరళలోని చోటానికరై దేవాలయం వంటి ప్రదేశాలలో చేతబడిని తీసివేసే పద్ధతులున్నాయని, చాలామందికి దీని గురించి తెలియదని అన్నారు. అయితే తాను చేతబడి కంటే కాలం (టైమ్), విధి (డెస్టినీ)ని బలంగా నమ్ముతానని సుమన్ తెలిపారు. మనిషి జీవితంలో ప్రతిదీ ఒక డిజైన్ ప్రకారం జరుగుతుందని, అది జరిగి తీరాల్సిందేనని అన్నారు. “మనం వేరేవాళ్ళ మీద చెప్పొచ్చు. వీడు తొక్కేశాడు, వీడు నొక్కేశాడు అని. ఆ టైమ్ అలా జరిపిస్తుంది” అని సుమన్ అభిప్రాయపడ్డారు. రోగాలు, ప్రమాదాలు కూడా కాలం ప్రకారమే వస్తాయని, మన శరీరంలోని ప్రతి భాగం గ్రహాలతో ముడిపడి ఉంటుందని, జ్యోతిష్యంపై తన అవగాహనతో చెప్పారు. జాతకాలను కూడా పైవాడు మార్చగలడని, దైవశక్తి అన్నింటికంటే గొప్పదని సుమన్ తన దృక్పథాన్ని వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
