ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. రోడ్లు ఎంతలా అభివృద్ధి చేస్తున్నా.. రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. వాటి వల్ల మరణాలూ ఆగడం లేదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు జరిగే ప్రమాదాల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్ వాడకపోవడమే. ఇబ్బందిగా ఉంటుందని కొందరూ.. ధర ఎక్కువగా ఉంటుందని మరికొందరూ హెల్మెట్లను వాడటం మానేస్తున్నారు. మరికొందరు వాడుతున్నా.. రోడ్ పక్కన నాణ్యతలేని హెల్మెట్లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు అవి మనుషుల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఇటీవల ద్విచక్ర వాహన తయారీదారులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాహనాల తయారీదారులే మంచి నాణ్యమైన హెల్మెట్లను తక్కువ ధరకు అందించాలని సూచించారు. వినియోగదారులు వాహనం కొనుగోలు చేసే సమయంలోనే వాటిని తప్పనిసరిగా తక్కువ ధరకు అందించాలని కోరారు.
2022లో దేశంలో హెల్మెట్ ధరించకపోవడంతో జరిగిన ప్రమాదాల్లో 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీదారులకు కీలక సూచన చేస్తున్నట్లు మంత్రి వివరించారు. వాహనం కొనుగోలు చేసేవారికి హెల్మెట్లపై కొంత తగ్గింపు ఇవ్వగలిగితే మనం ప్రజల ప్రాణాలను కాపాడగలమని ఆయన అన్నారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీ జరిమానాలను అమలు చేస్తున్నామన్నారు. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పులు రావడం లేదని ఆయన చెప్పారు. వాస్తవానికి దీనిని అమలు చేయడం కూడా సవాలుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
దేశంలోని ప్రతి తాలూకాలో డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించాలన్నది తన ఆశయమని గడ్కరీ చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంకలనం చేసిన “నేషనల్ స్ట్రాటజీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అనెన్షనల్ ఇంజురీ” అనే కొత్త నివేదిక ప్రకారం, రోడ్డు ప్రమాదాలు భారతదేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. అలాంటి మరణాలలో 43 శాతానికి పైగా, అతివేగమే ప్రధాన కారణం. 2022లో భారతదేశంలో 4,30,504 మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు. వారిలో 1,70,924 మంది బలమైన గాయాల కారణంగా మరణించారు. 2016 నుంచి 2022 వరకు డేటా చూస్తే పెరిగిందే గానీ తగ్గలేదు.
ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈవీ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కారణంగా కొనుగోలుదారులు కొంత మేర ప్రయోజనం పొందుతున్నారు. ఈ సబ్సిడీని విడతల వారీగా ప్రభుత్వం తగ్గిస్తోంది. ఫలితంగా ఆ భారం కొనుగోలుదారులపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న తాత్కాలిక ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్(ఈఎంపీఎస్) ఫేమ్-3 సబ్సిడీ అమలులో ఉంది. ఇది 2024 సెప్టెంబర్ తో ముగుస్తోంది. మళ్లీ ఈ సబ్సిడీలు పొడిగించే అవకాశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఇస్తున్న సబ్సిడీలు కంపెనీలు తగ్గించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..