
దేశంలో ఏవైనా ఆర్ధిక కార్యకాలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు అనేది తప్పనిసరి అని చెప్పవచ్చు. బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వరకు ప్రతీ పనికి ఈ కార్డు అవసరమే. దీంతో పాన్ కార్డుల్లో ఏమైనా మార్పులు చేస్తే దేశంలోని ప్రజలందరిపై ప్రభావితం చూపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వీటిల్లో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న కొన్ని నిబంధనల్లో సడలింపులు ఇవ్వగా.. మరికొన్ని రూల్స్‌ను కఠినతరం చేసింది. ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాన్ కార్డు ఉన్న ప్రతీఒక్కరూ ఈ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముంది.
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. కొన్ని ట్రాన్సాక్షన్లకు పాన్ అందించాల్సిన అవసరం లేదు. మరికొన్ని లావాదేవీలకు మాత్రం తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. నగదు డిపాజిట్లు, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, హోటల్ చెల్లింపులు, బీమా ప్రీమియంలతో పాటు ఎనిమిది ప్రధాన లావాదేవీలకు సంబంధించి నిబంధనలను మార్చారు. ఇప్పటివరకు రూ.50 వేల కంటే ఎక్కువ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే పాన్ అందించాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని తొలగించారు. ఇక నుంచి సంవత్సరానికి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేయాలంటే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆస్తి కొనుగోలు, అమ్మకంకు సంబంధించి పాన్ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు.
ఇక ఆస్తి లావాదేవీల పరిమితి రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షలకు పెంచారు. ఈ పరిమితులకు మించి చేసే నగదు లావాదేవీలకు మాత్రమే పాన్ అందించాల్సి ఉంటుంది. ఇక ఇన్యూరెన్స్‌కు సంబంధించి రూ.5 లక్షలు దాటిన ప్రీమియంలకు పాన్ కార్డు ఇవ్వాలి. పాన్ లేనివారికి రూ.2.5 లక్షల ప్రీమియం దాటితే కంపెనీలు ఐటీ శాఖకు సమాచారం అందించాలి. ఇక స్టాంప్ పేపర్ కొనుగోళ్లకు సంబంధించి పాన్ ఉన్నవారికి రూ.2 లక్షల పరిమితి ఉండగా.. లేనివారికి రూ.లక్షగా ఉంది. హోటల్స్, బాంకెట్ హాల్, ఈవెంట్ల చెల్లింపుల కోసం పరిమితిని రూ.లక్షకు పెంచారు. విదేశీ ప్రయాణ ఖర్చులు, విదేశీ కరెన్సీ కొనుగోళ్లు రూ.2 లక్షలు దాటితే పాన్ అందించాలి. పాన్ కార్డు లేనివారి కోసం ఫారం 60 స్థానంలో ఫారం 97 ప్రవేశపెట్టారు. అయితే రూ.45 లక్షలకు మించి ఆస్తి లావాదేవీలకు పాన్ పనిచేయదు.