
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే కొత్త మదుపరులు మార్కెట్ అస్థిరతను ఎదుర్కొనే సమయంలో తరచూ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల మార్కెట్లలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో ముఖ్యంగా మొదటిసారి పెట్టుబడులు ప్రారంభించిన వారిలో ఆందోళన పెరుగుతోంది. ఒక నెలలో పెట్టుబడుల విలువ పెరిగితే ఉత్సాహంగా కనిపించే మదుపరులు, తదుపరి నెలలో మార్కెట్ పడిపోతే SIPలను నిలిపివేయడం, ఫండ్లను మార్చడం లేదా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వంటి చర్యలకు దిగుతున్నారు. అయితే ఇదే దీర్ఘకాలిక రాబడులను దెబ్బతీసే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్‌ను ముందుగానే అంచనా వేసి సరైన సమయంలో పెట్టుబడి పెట్టాలని ప్రయత్నించడం కొత్త మదుపరులు చేసే అతిపెద్ద తప్పుగా భావిస్తున్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు చాలా మంది ఇంకా తగ్గాక పెట్టుబడి పెడదాం అని వేచి చూస్తారు. కానీ మార్కెట్ ఎప్పుడు తిరిగి కోలుకుంటుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఫలితంగా మంచి అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే SIP విధానం రూపొందించబడిందని, మార్కెట్‌ను ఊహించడం కంటే క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించడం ముఖ్యమని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.
మరోవైపు చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల మాదిరిగా భావించి ప్రతి ఏడాది స్థిరమైన రాబడులు ఆశిస్తున్నారు. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ ఆధారంగా పనిచేస్తాయి. కొన్ని సంవత్సరాలు అధిక రాబడులు రావచ్చు. మరికొన్ని సంవత్సరాలు తక్కువ లాభాలు లేదా నష్టాలు కూడా ఎదురవొచ్చు. ఇదే సహజమని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది అత్యధిక రాబడులు ఇచ్చిన ఫండ్ల వెంటపడటం కూడా మదుపరుల్లో పెరుగుతున్న ధోరణిగా కనిపిస్తోంది. అయితే గత పనితీరు భవిష్యత్తుకు హామీ కాదని మార్కెట్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అలాగే మొత్తం పెట్టుబడిని ఒకే విభాగంలోని ఫండ్లలో పెట్టడం కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ ఫండ్లు అధిక లాభాల అవకాశాలు కలిగించినప్పటికీ, భారీ ఒడిదుడుకులు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతో, సరైన ఆస్తి కేటాయింపుతో, భావోద్వేగాలకు లోనుకాకుండా పెట్టుబడులు కొనసాగించే మదుపరులే చివరికి మంచి ఫలితాలు సాధిస్తారని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి