
నగరాల్లో నిత్యం వేలాది మంది ఆఫీస్‌లకు వెళ్లేందుకు, ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్స్‌లో బైక్, ఆటో, క్యాబ్‌లు బుక్ చేసుకుంటున్నారు. వీటికి డిమాండ్ బాగా పెరగడంతో ఆయా కంపెనీలు ధరలు భారీగా పెంచేశాయి. పెంచిన ఛార్జీల్లో వాహన యాజమానులకు కూడా పెద్దగా ఇవ్వడం లేదు. దీంతో అటు వాహనదారులు, ఇటు వినియోగదారులు ఇద్దరికీ నష్టం జరుగుతోంది.
దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ అనే సరికొత్త యాప్‌ను రూపొందించింది. అతి తక్కువ ధరతో దేశ ప్రజలకు ట్యాక్సీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను క్రియేట్ చేసింది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుండి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. మొదట ఈ భారత్ ట్యాక్సీ యాప్‌ను ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు.
ఈ యాప్ రాకతో ‘ఓలా’, ‘ఉబర్’ సర్జ్ ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తం ఛార్జ్‌లో డ్రైవర్లకు 80 శాతానికి పైగా అందేలా యాప్ రూపొందించారు. ఈ ప్రభుత్వ యాప్‌కు వాహనదారుల నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 56,000 మంది డ్రైవర్లు నమోదు చేసుకున్నారు. ఈ యాప్‌లో ఆటోలు, కార్లు, బైక్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి