
ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరిగింది. అతి తక్కువ మొత్తంలో ఇందులో ప్రతి నెలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటంతో సామాన్య, మధ్య తరగతి వారు, ముఖ్యంగా యువత కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో తొలిసారి పెట్టుబడి పెట్టే వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌కు అనుసంధానమైన ఈ పెట్టుబడుల్లో రిస్క్ ఉన్నప్పటికీ, సరైన ప్రణాళికతో మంచి రాబడులు సాధ్యమవుతాయని చెబుతున్నారు.
పెట్టుబడి ప్రారంభించే ముందు తమ ఆర్థిక లక్ష్యాలు, కాల వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అంచనా వేయడం అవసరం. అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) సిద్ధంగా లేకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఒకే ఫండ్‌లో మొత్తం డబ్బు పెట్టకుండా విభిన్న విభాగాల్లో పెట్టుబడి చేయడం (డైవర్సిఫికేషన్) మంచిదని సూచిస్తున్నారు.
తొలి పెట్టుబడిదారులు నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రారంభిస్తే రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ వంటి స్థిరత్వం కలిగిన పథకాలు ప్రారంభ దశలో అనుకూలమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకునే దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి చేయడం అవసరం. అధిక రాబడి లక్ష్యంగా పెట్టుకునే వారు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లేదా ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. అయితే ఇవి అధిక రిస్క్ కలిగినవని గుర్తుంచుకోవాలి. గత పనితీరు, ఫండ్ మేనేజర్ అనుభవం, ఎక్స్‌పెన్స్ రేషియో వంటి అంశాలను పరిశీలించడం తప్పనిసరి.
పెట్టుబడి చేసే ముందు పథకం సమాచార పత్రం (SID) చదవడం, అవసరమైతే ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సరైన అవగాహనతో, దీర్ఘకాల ప్రణాళికతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే స్థిరమైన సంపద సృష్టి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి