
సాధారణంగా చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్‌తో పాటు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటారు. ఇక కొంతమంది పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక అకౌంట్ కూడా వాడుతున్నారు. రెండు కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగినవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇలా కలిగి ఉండటం మంచిదేనా..? లేదా ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. కొంతమంది రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డులు త్వరగా మంజూరు అవుతాయనే ఉద్దేశంతో వేర్వేరు బ్యాంక్ అకౌంట్లను తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండి వాడకపోతే భారీ నష్టం మూటకట్టుకోవాల్సి ఉంటుంది.
ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ప్రతీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ చేయకపోతే పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పట్లో ప్రతీ బ్యాంక్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలో నెలలవారీగా లేదా త్రైమాసికంగా నిర్దిష్ట సగటు నిల్వను ఉంచడాన్ని తప్పనిసరి చేస్తోంది. దీంతో మీ పాత లేదా ఇనాక్టివ్ అయిన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ఎక్కువ అకౌంట్లు కలిగి ఉంటే మీరే నష్టపోతారు.
ఇక ప్రతీ బ్యాంక్ అకౌంట్‌కు వార్షిక డెబిట్ కార్డు, ఎస్‌ఎంఎస్ ఛార్జీలు, ఇతర సేవా రుసుంలు ఉంటాయి. మీరు బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకపోయినా ప్రతీ ఏడాది ఈ ఛార్జీలు పడుతూనే ఉంటాయి. మీరు 12 నెలల పాటు బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకపోతే ఇనాక్టివ్ అవుతుంది. అలాగే 24 నెలల పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే నిద్రాణ స్థితికి వెలుతుంది. నిద్రాణ స్థితికి వెళ్లిన అకౌంట్‌ను తిరిగి ఉపయోగించుకోవాలంటే సుదీర్ఠమైన పత్రాల ప్రక్రియ ఉంటుంది. కొన్ని బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ రూ.10 వేలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీకు భారం అనిపించవచ్చు. దీంతో వీలైనంత తక్కువ అకౌంట్లను కలిగి ఉండటమే మంచిది. మన అవసరాలకు తగ్గట్లు ఎన్ని బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండాలనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే మీరు నష్టపోకుండా ఉంటారని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండటం వల్ల కన్‌ప్యూజన్ కూడా ఏర్పడుతుంది. దీంతో మీ లావాదేవీలను వేగంగా నిర్వహించుకోలేరు.