Mukesh Ambani: ఐదేళ్లుగా పైసా జీతం తీసుకోని ముఖేష్‌ అంబానీ! విడ్డూరంగా ఉంది కదా.. అసలు విషయం ఏంటంటే..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా ఐదో ఏడాదిగా తన జీతం తీసుకోలేదు. కానీ, ఆయన కుటుంబ సభ్యులు బోర్డు సభ్యులుగా సిట్టింగ్ ఫీజు, కమీషన్లు అందుకున్నారు. 2021-22 నుండి కరోనా కారణం గా ఆయన జీతం వదులుకున్నట్లు ప్రకటించారు.

Mukesh Ambani: ఐదేళ్లుగా పైసా జీతం తీసుకోని ముఖేష్‌ అంబానీ! విడ్డూరంగా ఉంది కదా.. అసలు విషయం ఏంటంటే..?

Updated on: Aug 07, 2025 | 5:39 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ అపర కుబేరుల్లోనే ఒకరు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ వరుసగా ఐదో ఏడాది కూడా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కంపెనీ నుంచి వేతనం తీసుకోలేదు. కరోనా కాలం నుంచి ఆయన జీతం తీసుకోవడం లేదు. ముకేశ్‌ వారసులు కూడా ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ.. బోర్డు సభ్యులుగా సిట్టింగ్‌ ఫీజు, కమీషన్‌ రూపంలో కొంత మొత్తం మాత్రం అందుకున్నారు. ఈ విషయాలన్నీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యానువల్‌ రిపోర్ట్‌లో వెల్లడించారు. కరోనా కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిన నేపథ్యంలో వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు అంబానీ 2021-22లో ప్రకటించిన విషయం తెలిసిందే. 2008-09 నుంచి కరోనా ముందు వరకు ఏడాది కాలానికి యానువల్‌ రెమ్యూనరేషన్‌ అందుకున్న అంబానీ, అది కూడా గరిష్ఠంగా రూ.15 కోట్లు మాత్రమే తీసుకోవాలని పరిమితి విధించుకున్నారు.

ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. 2029 ఏప్రిల్‌ వరకు ఆ పదవిలో కొనసాగుతారు. వేతనమే కాదు ఇతర అలవెన్సులు, ముందస్తు ఖర్చులు, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు, కమీషన్లు, స్టాక్ ఆప్షన్లను కూడా పొందలేదు. అయితే ముకేశ్‌ ప్రయాణం, లాడ్జింగ్‌, బోర్డింగ్‌, వ్యాపార పర్యటనలకయ్యే ఖర్చులను మాత్రం కంపెనీనే భరిస్తుంది. ముకేశ్‌తో పాటు ఆయన కుటుంబానికి భద్రతకయ్యే ఖర్చూ కంపెనీదే.ముకేశ్‌ కుమార్తె ఈశా, కుమారులు ఆకాశ్‌, అనంత్‌ 2023 అక్టోబర్‌లో రిలయన్స్‌ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఆ ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్కరు సిట్టింగ్‌ ఫీజు కింద రూ.0.06 కోట్లు, కమీషన్ కింద రూ.2.25 కోట్లు అందుకున్నారు.

2023లో ముకేశ్ సతీమణి నీతా అంబానీ బోర్డు నుంచి వైదొలిగారు. ఆమెకు ఆ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.0.02 కోట్లు సిట్టింగ్ ఫీజు, రూ.0.97 కోట్లు కమీషన్ కింద ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో ముకేశ్‌, ఆయన కుటుంబానికి 50.33 శాతం వాటా ఉంది. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ రూపంలో రూ.3,322.7 కోట్లు రావడం గమనార్హం. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ముకేశ్‌, ఆయన వారసులు 6.44 లక్షల కోట్ల షేర్లు కలిగి ఉన్నారు. ఫోర్బ్స్‌ ప్రకారం ముకేశ్ నికర సంపద 103.3 బిలియన్ డాలర్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 18వ స్థానంలో ఉన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.