
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించవచ్చు అనే నమ్మొచ్చు కానీ, ఏకంగా రూ.2 కోట్లు అనే సరికి చాలా మంది నోరెళ్లబెట్టి ఉంటారు. కానీ, క్రమశిక్షణతో ప్రతి నెలా రూ.18 వేలు పెట్టుబడి పెడితే కచ్చితంగా రూ.2 కోట్ల నిధిని సొంతం చేసుకోవచ్చు. నెలకు కొన్ని వేల రూపాయల పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల సంపద ఎలా సాధ్యమవుతుందనే సందేహం ఉంటుంది, అది సహజం. అయితే సరైన ప్రణాళికతో దీర్ఘకాల పెట్టుబడి, క్రమశిక్షణతో అది పెద్ద కష్టం కాదు అని చెబుతున్నారు చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్. ఆయన ఎనాలసిస్ ప్రకారం.. నెలకు కేవలం రూ.18 వేలతో ప్రారంభించే ఒక Step-Up SIP ద్వారా కూడా సుమారు రూ.2 కోట్ల కార్పస్ నిర్మించవచ్చని తెలుస్తోంది.
SIP అంటే ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం. అయితే Step-Up SIPలో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని కొద్దిగా పెంచుకోవడం. ఉదాహరణకు మొదటి సంవత్సరం నెలకు రూ.18 వేలు పెట్టుబడి పెడితే, వచ్చే సంవత్సరం దానిని 5 శాతం లేదా 6 శాతం పెంచి పెట్టుబడి పెట్టడం. సాధారణంగా జీతాలు ఏటా పెరుగుతుంటాయి కాబట్టి ఈ విధానం ఆదాయానికి అనుగుణంగా పెట్టుబడిని పెంచుకునేందుకు సహాయపడుతుంది.
ఈ ఫార్ములాను 20 సంవత్సరాల పాటు కొనసాగిస్తే.. సగటున సంవత్సరానికి 10 శాతం రాబడి వచ్చినా కూడా భారీ కార్పస్ తయారవుతుందని కౌశిక్ వివరించారు. ఈ కాలంలో మొత్తం మీరు పెట్టే డబ్బు సుమారు రూ.80 లక్షల వరకు ఉండొచ్చు. కానీ దీర్ఘకాల కంపౌండింగ్ ప్రభావం వల్ల, చివరికి ఈ పెట్టుబడి విలువ దాదాపు రూ.2 కోట్లకు చేరుతుంది. అయితే ఈ లెక్కలు కొన్ని అంచనాలపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. మార్కెట్ రాబడులు ప్రతి సంవత్సరం ఒకేలా ఉండవు. అలాగే ద్రవ్యోల్బణం ప్రభావం కూడా రిటైర్మెంట్ ప్లానింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ ప్లాన్ చేసి, తొందరగా ప్రారంభించి, మధ్యలో ఆపకుండా పెట్టుబడి కొనసాగిస్తే చిన్న మొత్తాలతో కూడా పెద్ద లక్ష్యాలను సాధించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి