
మన దేశంలోని కార్ల మార్కెట్ పై మరో విదేశీ కంపెనీ కన్నేసింది. ఇక్కడి లోకల్ కంపెనీతో టై అప్ అయ్యి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తోంది. ఆ కంపెనీ పేరు మిత్సుబిషి కార్ప్. ఇది జపాన్ దేశంలో ప్రముఖ ట్రేడింగ్ హౌస్. అన్ని కుదిరితే ఈ ఏడాది వేసవిలోనే మన దేశంలో కార్ల విక్రయ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు దేశంలోని కార్ల డీలర్‌షిప్‌లను నిర్వహిస్తున్న ప్రధాన కార్ల విక్రయదారు టీవీఎస్ మొబిలిటీలో 30 శాతానికి పైగా వాటాను కొనుగోలు చేసింది. ఈ మేరకు తన కార్యకలాపాలను ఈ వేసవి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు ఆన్ లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మిత్సుబిషి చేసుకున్న ఒప్పందం ప్రకారం టీవీఎస్ మొబిలిటీ తన కార్ల విక్రయ వ్యాపారాన్ని నిలిపివేయాల్సి ఉంది. మిత్సుబిషి టీవీఎస్ సంస్థలో 30 శాతానికి పైగా వాటాను తీసుకుంటుంది అంటే పెట్టుబడి 5 బిలియన్ల నుండి 10 బిలియన్ యెన్ (33 మిలియన్ డాలర్ల నుంచి 66 మిలియన్ డాలర్లు) మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది కొన్ని నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడిని ఖరారు చేసిన తర్వాత మిత్సుబిషి తన ఉద్యోగులను డీలర్‌షిప్‌కు పంపాలని యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
టీవీఎస్ మొబిలిటీకి ప్రస్తుతమున్న150 అవుట్‌లెట్‌లను ఉపయోగించి ప్రతి కార్ బ్రాండ్‌కు ప్రత్యేక షోరూమ్‌లను సృష్టిస్తుంది. ఇప్పటికే టీవీఎస్ లైనప్‌లో ఉన్నహోండా కార్ల అమ్మకాలను పెంచడంపై మొదట దృష్టి పెట్టనున్నట్లు చెబుతున్నారు. జపనీస్ కార్ బ్రాండ్‌లు, మోడల్‌ల శ్రేణిని మెరుగుపరచడానికి మిత్సుబిషి జపనీస్ ఆటోమేకర్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీలర్‌షిప్ దాని లైనప్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) అందజేస్తుంది, మిత్సుబిషి భారతదేశంలో ఈవీలను విస్తృతంగా స్వీకరించడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, పోటీతత్వ భారత మార్కెట్‌లో అమ్మకాలను పెంచడానికి, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా మెయింటెనెన్స్ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడానికి, బీమాను కొనుగోలు చేయడానికి కస్టమర్‌లను ఎనేబుల్ చేయడం వంటి కొత్త సేవలను కూడా పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా తమ మార్కెట్ వేగంగా విస్తరించేలా మిత్సుబిషి ప్రణాళిక చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం కొత్త కార్ల అమ్మకాలలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. చైనా, యూఎస్ తర్వాత మన దేశంలోనే ఎక్కువగా కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే జపాన్ వాహన తయారీదారులు మాత్రం ఇక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయారు. అయితే ఒక్క సుజుకి మోటార్ మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది. మిత్సుబిషి తన కొత్త కంపెనీ ద్వారా స్థానిక బ్రాండ్‌లతో పాటు జపాన్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..