Stock Market: వామ్మో.. స్టాక్ మార్కెట్‌లో క్లెయిమ్ చేయని సొమ్ము ఎన్ని కోట్లుందో తెలుసా?

|

Jun 01, 2024 | 6:23 PM

ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్) వివరాల ప్రకారం.. క్లెయిమ్ చేయని పెట్టుబడులు 2023 మార్చి నాటికి షేర్లలోనే రూ. 25 వేల కోట్లు ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో రూ.35 వేల కోట్లు, ఎల్ఐసీ దగ్గర రూ.21,500 కోట్లు, పీఎఫ్ లో రూ.48 వేల కోట్లు, బ్యాంకులలో రూ.62 వేల కోట్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

Stock Market: వామ్మో.. స్టాక్ మార్కెట్‌లో క్లెయిమ్ చేయని సొమ్ము ఎన్ని కోట్లుందో తెలుసా?
Unclaimed Investments
Follow us on

భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరూ వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడతారు. బ్యాంకులలో డిపాజిట్లు చేస్తారు. పాలసీలు తీసుకుంటారు. ఇలా ఆర్థిక మార్కెట్ లో వివిధ పద్ధతులలో తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. కొందరు వీటిని సక్రమంగా నిర్వహించి చివరిలో రాబడి పొందుతారు. మరికొందరు మధ్యలోనే వదిలేస్తారు. ఇలా మధ్యలో వదిలేసిన పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలు, షేర్లతో పాటు చిరునామా, నామినీ వివరాలు సక్రమంగా లేకపోవడం వల్ల చాలా డబ్బు నిద్రాణ స్థితి (క్లయిమ్ చేయనిది)లో ఉండిపోతోంది.

నివేదిక ప్రకారం..

ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్) వివరాల ప్రకారం.. క్లెయిమ్ చేయని పెట్టుబడులు 2023 మార్చి నాటికి షేర్లలోనే రూ. 25 వేల కోట్లు ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో రూ.35 వేల కోట్లు, ఎల్ఐసీ దగ్గర రూ.21,500 కోట్లు, పీఎఫ్ లో రూ.48 వేల కోట్లు, బ్యాంకులలో రూ.62 వేల కోట్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

క్లెయిమ్ చేయకపోవడానికి కారణాలు..

అవగాహన లేకపోవడం.. ఫైనాన్షియల్ మార్కెట్ లోకి చాలా మంది పెట్టుబడిదారులు వస్తున్నారు. కానీ నిబంధనలపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదు. కంపెనీలు, కస్టోడియన్లకు తమ లేటెస్ట్ కాంటాక్ట్ వివరాలను తెలపడం లేదు.

చిరునామా మార్పు.. బదిలీలు, కమ్యూనికేషన్ చిరునామాలలో మార్పులు కాంటాక్ట్ కోల్పోవడానికి కారణమవుతున్నాయి. వీటి వల్ల డివిడెండ్ నోటీసులు, ఖాతా స్టేట్‌మెంట్లు వారికి చేరడం లేదు.

పనిచేయని ఖాతాలు.. పెట్టుబడులకు లింక్ చేయబడిన డోర్మాంట్ బ్యాంక్ ఖాతాలు, ఇన్‌యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల వల్ల కొన్ని పెట్టుబడులు క్లెయిమ్ చేసుకోవడం కుదరడం లేదు.

పెట్టుబడిదారుల మరణం.. కొందరు పెట్టుబడిదారులకు సరైన వారసత్వ ప్రణాళిక ఉండడం లేదు. తమ పెట్టుబడి విషయాన్ని నామినీలకు తెలియజేయడం లేదు. ఇలాంటి సందర్భాల్లో పెట్టుబడిదారుడు మరణిస్తే, ఆయా పెట్టుబడులు క్లెయిమ్ చేయడం కుదరడం లేదు.

ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లు.. షేర్ మార్కెట్ లో లావాదేవీలకు డీమ్యాట్ ఖాతా కీలకం. చాలామంది ఇన్వెస్టర్లు తమ పాత ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను కలిగి ఉంటున్నారు. ఈ పద్ధతి క్లెయిమ్ చేయని డివిడెండ్లకు దారి తీస్తుంది.

నష్టాలు ఇవే..

క్లెయిమ్ చేయని పెట్టుబడులు వల్ల ఇన్వెస్టర్లకు నష్టం కలిగిస్తాయి. అలాగే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారతాయి. నిద్రాణమైన ఖాతాలు వాటిని నిర్వహించే కంపెనీలకు వనరులను దెబ్బతీస్తాయి. తద్వారా మార్కెట్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.

దేనిలో ఎంత ఉందంటే..

మ్యూచువల్ ఫండ్స్.. క్లయిమ్ చేయని సొమ్ము 2023 మార్చి నాటికి మ్యూచువల్ ఫండ్స్ లో రూ.35 వేల కోట్లు ఉంది. కొందరు ఇన్వెస్టర్లు చిన్న పెట్టుబడులను మర్చిపోవడం, సిప్ పెట్టుబడులను ఖాతా మూసివేయకుండా ఆపేయ్యడం, నామినీ వివరాలు లేకపోవడం దీనికి కారణం.

బీమారంగం.. బీమా రంగం కూడా క్లయిమ్ చేయని పెట్టుబడుల సవాల్ ను ఎదుర్కొంటుంది. పాలసీదారులు తమ చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం, మెచ్యూరిటీ ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం, పాలసీ డాక్యుమెంట్లను పోగొట్టుకోవడం తదితర కారణాలతో ఈ సమస్య ఏర్పడుతోంది. ఎల్ఐసీ వద్ద రూ. 21,500 కోట్లు, ప్రైవేట్ బీమా సంస్థల వద్ద కూడా భారీగా క్లయిమ్ చేయని మొత్తం ఉందని సమాచారం.

ప్రావిడెంట్ ఫండ్.. ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో కొంత మొత్తం పీఎఫ్ కు చందాగా చెల్లిస్తారు. అయితే కొందరు ఉద్యోగాలు మారడం, వేరే చోటుకు వెళ్లిపోవడం, విరమణ తర్వాత సరైన క్లెయిమ్ దాఖలు చేయడం లేదు. ఇలా క్లయిమ్ చేయని సొమ్ము ఈపీఎఫ్ఓ దగ్గర రూ.48 వేల కోట్లు ఉన్నట్లు అంచనా.

బ్యాంక్ డిపాజిట్లు.. పదేళ్లకు పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న సేవింగ్స్, కరెంట్ ఖాతాలు, మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను అన్‌క్లెయిమ్ గా వ్యవహరిస్తారు. దేశంలో ఇలా క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు రూ. 62 వేల కోట్లకు మించి ఉన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇన్ యాక్టివ్ ఖాతాల విషయాన్ని ప్రజలు మర్చిపోవడం, చిరునామాలో మార్పులు, నామినీ నమోదు లేకపోవడం వంటివి దీనికి కారణాలుగా చెప్పవచ్చు.

రికవరీ ప్రక్రియ.. క్లెయిమ్ చేయని పెట్టుబడులను తిరిగి పొందడం చాలా కష్టం. అలాగే చాలా సమయం పడుతుంది. దీనికోసం పెట్టుబడిదారులు అనేక చట్టపరమైన అంశాలను ఎదుర్కొంటారు.

సర్వీస్ ప్రొవైడర్లు..

  • క్లెయిమ్ చేయని పెట్టుబడుల సమస్యను పరిష్కరించడానికి కొన్ని సంస్థలు మనకు సహాయ పడతాయి. ఇవి అనేక విధానాలుగా సహాయ పడతాయి.
  • వివిధ మార్గాల ద్వారా క్లెయిమ్ చేయని ఆస్తులను గుర్తించడంలో ఖాతాదారులకు సహాయం చేస్తాయి.
  • అవసరమైన పత్రాల సేకరణ తదితర విషయాలలో ఖాతాదారులకు మార్గనిర్దేశం చేస్తాయి.
  • క్లయింట్ల తరఫున కంపెనీలు, నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతాయి.
  • సేవలకు చార్జీగా రికవర్ చేసిన మొత్తంలో ఒక శాతంగా రుసుమును వసూలు చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..