స్టాక్‌మార్కెట్లలో బుల్ రన్. మామూలుగా చూడని రేంజ్‌లో లాభాలు. ఇందుకు కారణం మోదీ. ఔను మోదీ సర్కార్ మూడోస్సారి అంటూ వస్తోందనే అంచనాలతో బుల్స్ దౌడు తీశాయి. స్టాక్‌మార్కెట్లలో మోదీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వచ్చిన 303 సీట్లకన్నా బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయనే అంచనాలు ఎగ్జిట్‌పోల్స్‌లో కనిపించడమే ఇందుకు కారణం. గత వారమంతా మార్కెట్లకు నీరసమే. ఈ నీరసమంతా ఇవాళ కొట్టుకుపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ సూచీ 2622 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. పనిలోపనిగా సెన్సెక్స్ 76వేల పాయింట్ల మార్కును కూడా దాటి, 76,583 పాయింట్ల దగ్గర ఓపెన్ అయిందంటే, ఈ జోరు, ఈ హోరు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు నిఫ్టీ కూడా 600 పాయింట్ల లాభంతో ఓపెన్ అయి, 23వేల పాయింట్లను దాటేసింది. అయితే సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు నీరుగారిపోలేదు. కొనుగోళ్ల జోరు అలాగే కనిపిస్తోంది.
మార్కెట్లలో బుల్స్ పార్టీ చేసుకుంటే, అదానీ గ్రూప్ స్టాక్స్ ఇందులో ముందువరుసలో నిలిచాయి. ఈ ఉదయం ట్రేడింగ్‌లో అదానీ షేర్లు 16 శాతం పెరిగాయి. అంటే అదానీ గ్రూప్‌నకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసినవారు లక్షా 40వేల రూపాయల విలువైన లాభాలు గడించారు. స్టాక్‌మార్కెట్లు జోస్యం చెబుతాయంటారు. వచ్చే పరిణామాన్ని ముందే పసిగడతాయని అంటారు. మోదీ సర్కార్ ధమాకా సీట్లతో హ్యాట్రిక్ కొడుతుందనీ ఎగ్జిట్‌పోల్స్ చెప్పడంతో ఇవాళ మార్కెట్లు పరుగులు పెడతాయని ఊహించారు. కానీ ఆ పరుగు ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, ఎన్నికల ఫలితాలు ఇలాగే ఉంటే, సెన్సెక్స్ 80వేలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కరలేదని మార్కెట్ పండితులు లెక్కలు కడుతున్నారు.
మోదీ సర్కార్ ఇదే ఊపులో, మూడోసారి అధికారంలోకి వస్తే, విదేశీ ఇన్వెస్టర్ల జాతర మళ్లీ మొదలవుతుందని అంటున్నారు. ఒక్క నిఫ్టీలోనే ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 23,400 కోట్ల రూపాయల విలువైన బేరిష్ పొజిషన్లు తీసుకున్నారు. రేపటి ఫలితాల తర్వాత ఈ విదేశీ బాబులు తమ మనసు మార్చుకుని, బేరిష్ బెట్స్‌ను మార్చుకోవచ్చని అంచనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే, మన స్టాక్‌మార్కెట్లలో బుల్స్ దూకుడుకు పగ్గాలు వేయడం ఎవరి తరమూకాదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..