Malaysia: భారతీయులకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్‌ 1 నుంచి మలేషియాకు వీసా అక్కర్లేదోచ్‌..

పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఎలాంటి వీసా లేకుండానే భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులు మలేషియా పర్యటనకు అనుమతిచ్చింది. ఈ మేరకు మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్‌వార్షిక సమావేశంలో వెల్లడించారు. మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి కీలకం అని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు..

Malaysia: భారతీయులకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్‌ 1 నుంచి మలేషియాకు వీసా అక్కర్లేదోచ్‌..
Visa Free Entry To Malaysia
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2023 | 8:45 AM

మలేషియా, నవంబర్‌ 27: పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఎలాంటి వీసా లేకుండానే భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులు మలేషియా పర్యటనకు అనుమతిచ్చింది. ఈ మేరకు మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్‌వార్షిక సమావేశంలో వెల్లడించారు. మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి కీలకం అని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు.

ఇందులో భాగంగానే చైనా, భారత్‌ పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. మలేషియాలోకి దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని ఆయన తెలిపారు. భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా సౌకర్యాలను మెరుగుపరుస్తామని గత నెలలోనే అన్వర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అందుకు సంబంధించిన ప్రకటన వెలువరించారు.

కాగా వీసా లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్‌, శ్రీలంక ప్రభుత్వాలు కల్పించాయి. నవంబర్‌ 10 నుంచి వచ్చే ఏడాది మే 10వరకు థాయిలాండ్‌లో ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది. డిమాండు పెరిగితే దాన్ని తదుపరి కొనసాగించే అవకాశం ఉంటుందని థాయిలాండ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక శ్రీలంక కూడా భారత్‌ సహా ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండా పర్యటించేందుకు వెసులుబాటు కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది అందుబాటులో ఉంటుంది. తాజాగా మలేషియా కూడా ఈ సదుపాయం కల్పించినప్పటికీ ఎప్పటి వరకు అమలులో ఉంటుందనేది మాత్రం స్పష్టం చేయలేదు. డిసెంబర్‌ 1 వరకు మాత్రం మలేషియాలోకి ప్రవేశించడానికి చైనా, భారతీయ పౌరులు తప్పనిసరిగా వీసా తీసుకెళ్లవల్సి ఉంటుంది. డిసెంబర్‌ 1 తర్వాత ఈ వెసులుబాటు అమలులోకి వస్తుంది.

మలేషియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్య మలేషియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు. వీరిలో చైనా నుంచి 4,98,540 మంది, భారత్‌ నుంచి 2,83,885 మంది పర్యాటకులు మలేషియాను సందర్శించారు. కోవిడ్‌ మహమ్మారికి ముందు అంటే 2019 చైనా నుంచి 1.5 మిలియన్ల పర్యాటకులు వస్తే.. భారత్‌ నుంచి 3,54,486 మంది మలేషియాను సందర్శించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.