
ఇండియా చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మారలేదు. పేదరికం, నిరుద్యోగం మన దేశాన్ని దశాబ్ధాలుగా వెంటాడుతున్నాయి. అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటి మన దేశంలోనే ఉందని మీకు తెలుసా? ఎస్.. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ఆ గ్రామస్థులు ఏకంగా 7 వేల కోట్లు డిపాజిట్ల రూపంలో ఆయా బ్యాంకుల్లో దాచుకున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? దాని కథేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని మాధాపర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా గ్రామాల్లో ఒకటి, రెండు బ్యాంకు శాఖలు ఉంటేనే పెద్ద విషయంగా భావిస్తాం. కానీ మాధాపర్‌లో ఏకంగా 17 బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో మొత్తం కలిపి 7 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అందుకే మాధాపర్‌ను ప్రపంచంలోని అత్యంత సంపన్న గ్రామాల్లో ఒకటిగా చెబుతుంటారు.
మాధాపర్‌లో ఇన్ని బ్యాంకులు ఉండటానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల ఆర్థిక స్థోమత, విదేశాల్లో స్థిరపడిన కుటుంబాలతో ఉన్న బలమైన సంబంధాలే. గ్రామానికి చెందిన అనేక కుటుంబాల సభ్యులు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాల్లో సంపాదించిన డబ్బులో గణనీయమైన మొత్తాన్ని స్వగ్రామానికి పంపడం, ఇక్కడ పొదుపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం వంటి కారణాలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగాయి.
మాధాపర్‌ను ఇప్పటికీ ఒక సాధారణ గ్రామమే. భారత జనగణనలో మధాపర్‌గా నమోదైన ఈ ప్రాంతం భుజ్ తాలూకాలో ఉంది. 2011 జనగణన ప్రకారం మాధాపర్‌లో 32,293 మంది జనాభా ఉంది. వీరిలో 16,276 మంది పురుషులు, 16,017 మంది మహిళలు. మాధాపర్ ప్రత్యేకత కేవలం బ్యాంకుల్లో ఉన్న డబ్బు మాత్రమే కాదు. విదేశాలకు వెళ్లిన కుటుంబాలు స్వగ్రామంతో సంబంధాలను కొనసాగిస్తూ విద్య, వైద్యం, రహదారులు, సామాజిక సేవలు వంటి కార్యక్రమాలకు కూడా సహకరిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అందుకే మాధాపర్ కథను కేవలం డబ్బున్న గ్రామంగా కాకుండా విదేశీ వలసలు, పొదుపు సంస్కృతి, స్వగ్రామంపై పెట్టుబడి కలిసిన ప్రత్యేక ఆర్థిక నమూనాగా కూడా చూడవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి