Defence Exports: భారతదేశ ఆయుధాలపై ప్రపంచ దేశాల ఆసక్తి.. గణనీయంగా పెరిగిన ఎగుమతులు

భారతదేశంలో తయారీ రంగం రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, ఇండియా పరస్పర సైనిక చర్యతో ఇండియా పవర్ ఏంటో? ప్రపంచ దేశాలకు తెలిసింది. దీంతో చాలా దేశాలు భారతదేశంలో తయారయ్యే రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ వల్లే కాకుండా ముందు నుంచే అంటే ఓ పదేళ్ల నుంచే రక్షణ రంగ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయి.

Defence Exports: భారతదేశ ఆయుధాలపై ప్రపంచ దేశాల ఆసక్తి.. గణనీయంగా పెరిగిన ఎగుమతులు
Defence Exports

Updated on: May 21, 2025 | 5:15 PM

భారతదేశంలో గత 11 సంవత్సరాల్లో దాదాపు 100 దేశాలకు భారతదేశం చేసిన రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగాయి, 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.686 కోట్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.23,622 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని సరళీకృతం చేయడం, లైసెన్స్ పాలన నుంచి భాగాలను తొలగించడం, పరికరాల ఎగుమతులకు నియమాలను సడలించడం వంటి అనేక విధాన చర్యలు భారతదేశం రక్షణ పరికరాల నికర దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారడానికి దోహదపడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రక్షణ పరికరాలు తాజా సాంకేతిక పరిజ్ఞానంతో బాగా అనుసంధానించి ఉండడం వల్ల భారతదేశ రక్షణ ఎగుమతులు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా ఎక్కువ వేగంతో పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.21,083 కోట్ల నుంచి 12 శాతం పెరిగి ఈ స్థాయికు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు రూ.30,000 కోట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50,000 కోట్లకు పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో భారతదేశం రక్షణ రంగ ఉత్పత్తుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడేది. అయితే గత పదేళ్లల్లో ప్రభుత్వ చర్యలతో ఎగుమతులు చేసే స్థాయికు ఎదిగింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 80 దేశాలకు భారతదేశ తయారీ రక్షణ రంగ ఉత్పత్తలు ఎగుమతి అయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1న ఒక ప్రకటనలో తెలిపింది.

భారతదేశంలో బ్రహ్మోస్‌తో పాటు ఇతర బాలిస్టిక్ క్షిపణులైన కే4, కే15, ఆర్టిలరీ గన్స్, టెక్ ఎనేబుల్డ్ రైఫిల్స్ ఇతర దేశాలను ఆకర్షిస్తున్నాయని నిపునులు చెబుతున్నారు .రక్షణ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నెలలో విడుదల చేసిన ప్రకటనలో రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో తమ ఎగుమతుల్లో 42.9 శఆతం గణనీయమైన పెరుగుదలను చూపించాయని పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతుల్లో ప్రైవేట్ రంగంతో పాటు డీపీఎస్‌యూలు వరుసగా రూ.15,233 కోట్లు, రూ.8,389 కోట్లు వాటాను సాధించాయి. అయితే 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు వరుసగా రూ.15,209 కోట్లు, రూ.5,874 కోట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా రక్షణ ఎగుమతులు 21 రెట్లు పెరిగాయి. 2004-14 దశాబ్దంలో రూ.4,312 కోట్ల నుండి 2014-24 దశాబ్దంలో రూ.88,319 కోట్లకు పెరిగాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..