
మిడిలీస్ట్ యుద్ధం మన వంటింట్లో మంట బెట్టేసింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత నషాళానికంటేసింది. బ్లాక్‌మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి నాలుగైదు వేలదాకా పలకడంతో రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్ అన్నీ మూతబడే ప్రమాదంలో పడ్డాయి. ఏపీలో ఐతే బచావ్ బచావ్ అంటూ గవర్నమెంట్ కాళ్ల మీద పడ్డాయి హోటల్ మేనేజ్‌మెంట్లు. ఏపీ స్టార్‌హోటల్స్, విజయవాడ హోటల్స్ సంఘాల జేఏసీ నాయకులు సివిల్ సప్లైస్ డైరెక్టర్ నూపుర్ అజయ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. 3 కీలక పాయింట్లపై ఓ నిర్ణయానికొచ్చారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే హోటల్స్ రన్ చేయాలి.. అన్ని హోటళ్లూ సోమవారం సెలవు ప్రకటించాలి.. స్టార్ హోటల్స్‌లో ఐటమ్స్ 45 నుంచి 15కి తగ్గించాలి..! ఇవీ కండిషన్లు. నేడో రేపో జీవో రిలీజౌతుంది. సోమవారం సెలవు విషయంలో మాత్రం సడలింపు జరగొచ్చట. ఎందుకంటే, రాష్ట్రం మొత్తమ్మీద సోమవారం హోటళ్లు మూసేస్తే కస్టమర్లు ఇబ్బంది పడే ప్రమాదముంది. అదేవిధంగా, హోటళ్లలో ఇకపై ఫుడ్ మెనూ కూడా పూర్తిగా మారిపోతోందా?
కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్‌లైన్స్ ప్రకారం 80 శాతం డొమెస్టిక్ యూజర్స్‌కి మిగతా 20 శాతం మాత్రమే కమర్షియల్ యూజ్‌కి ఇవ్వాలి. కనీసం 50 శాతం ఎల్‌పీజీ ఐనా కేటాయించాలని వేడుకుంది హోటళ్ల జేఏసీ. కానీ, డిమాండ్‌కి తగ్గ సరఫరా లేక కొరత ఏర్పడింది గనుక.. హోటల్ యాజమాన్యాలు మంకుపట్టు పట్టడం లేదు. కాకపోతే, ఆ 20 శాతం కోటా కూడా పెద్ద హోటళ్లకే వెళుతోందన్నది చిన్న హోటళ్ల గగ్గోలు.
అటు, ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయాలు కూడా రెడీ ఔతున్నాయ్. కట్టెలపొయ్యి, బయోగ్యాస్, ఎలక్ట్రికల్ స్టవ్.. కిచెన్ కాన్సెప్ట్‌లే మారిపోతున్నాయి. గ్యాస్ వినియోగం తగ్గించే తండూరీ ఐటమ్స్‌నీ, బొగ్గుల పొయ్యితో చేసే వంటల్ని ఎంకరేజ్ చేస్తోంది ప్రభుత్వం. బిరియానీ లాంటి సౌతిండియన్ ఐటమ్స్‌ని కట్టెల పొయ్యి మీదే వండుకోవాలని ఆదేశాలూ వచ్చేశాయ్. విధి లేక, స్విగ్గి జొమాటోలను కూడా కంట్రోల్ చేసి, వీలైనంతవరకు ఆర్డర్లు తగ్గించుకుంటున్నారు హోటల్ మేనేజ్‌మెంట్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.