
ఇంటిని పునరుద్దరించడం అంటే కేవలం అందాన్ని తీసుకురావడమే కాదు. దాన్ని విలువను మరింత పెంచడం అని చెప్పవచ్చు. ఇంటికి మరమ్మతులు చేయడం, కొత్త ఫ్లోరింగ్ వేయడం, మరుగుదొడ్లు పెంచడం, పైన అంతస్తు వేయడం, కుటుంబ సభ్యుల అవసరాలకు అనుగుణంగా గదులను విస్తరించడం.. ఇలా అనేక పనులు చేయవచ్చు. కొత్త ఇంటిని నిర్మించుకున్నప్పుడు ఇచ్చే రుణాల మాదిరిగానే, ఇంటి పునరుద్దరణకు కూడా బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. వాటిని ఈ కింద తెలిపిన విధానాల్లో పొందవచ్చు.
ఇంటి మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక రుణాలను అందజేస్తాయి. సాధారణ వడ్డీ రేట్లు, నెలవారీ వాయిదా పద్ధతుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకుని ఇంటిని బాగుచేయించుకోవచ్చు.
కొందరు వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. వాటితో ఇంటికి మరమ్మతులు చేయించుకుంటారు. వీటిని ఎలాంటి పూచీకత్తు లేకుండా చాలా సులభంగా పొందవచ్చు. అయితే ఇంటి మరమ్మతు రుణాలతో పోల్చితే వీటికి వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి.
ఆస్తిపై రుణం తీసుకుని, ఆ సొమ్ములను మరమ్మతుల కోసం వినియోగించవచ్చు. వీటిని ఎల్ఏపీ రుణాలు అంటారు. వ్యక్తిగత రుణాలలో పోల్చితే వీటికి తక్కువ వడ్డీపై పెద్ద మొత్తంలో రుణాలను అందజేస్తారు. ఇప్పటికే హౌసింగ్ రుణం ఉంటే, మీరు టాప్ అప్ రుణం పొందవచ్చు. దీన్ని మీ ఇంటి పునరుద్దరణతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి