
బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. మినిమం 750 స్కార్ ఉండాలి. లేకపోతే ఏ బ్యాంక్ కూడా రుణం మంజూరు చేయదు. మీరు దరఖాస్తు పెట్టుకున్నా రిజెక్ట్ అవుతుంది. దీంతో లోన్ అవసరమైనవారు డిజిటల్ లోన్ యాప్స్‌ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ యాప్స్‌లలో అధిక వడ్డీతో పాటు భారీ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజులు వంటివి వసూలు చేస్తూ ఉంటారు. ఇక లోన్ తీసుకున్నాక చెల్లించకపోతే వేధించడం, బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక లోన్ తీసుకునేటప్పుడు ఒక వడ్డీ ఉంటే.. తీసుకున్నాక అధిక వడ్డీ వసూలు చేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి. దీంతో ఇలాంటి యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేలా వేటు వేస్తోంది.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న పలు లోన్ యాప్స్‌పై కేంద్రం ఎప్పటికప్పుడు నిషేధం విధిస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో ఆరు డిజిటల్ లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసింది. ప్లే స్టోర్‌లో ఉన్న ఆరు రుణ యాప్‌ల యాక్సెస్‌ను తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గూగుల్‌ను ఆదేశించింది. లోన్‌ఆర్బిట్, హిసాబ్, నెక్సస్ లోన్, వన్ ఫండ్, క్రెడిట్ ఫ్యాక్టర్, మొబైల్ క్రెడిట్ ప్రైరీ అనే ఆరు యాప్‌లు ఇందులో ఉన్నాయి. అత్యవసరంగా లోన్ అవసరమయ్యే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. వీటి URLలను తొలగించాలని లేదా యాక్సెస్‌ను తొలగించాలని గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన తేదీ నుండి మూడు గంటల్లోపు యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ యాప్ సేవలు నిలిచిపోయాయి.
రుణాలు మంజూరు చేసే సమయంలో తక్కువ వడ్డీ రేట్లను చూపిస్తున్నాయి. ఒకసారి పంపిణీ చేసిన తర్వాత అసలు మొత్తంపై “అధిక వడ్డీ రేట్లు” విధించాలని వినియోగదారులను డిమాండ్ చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇక ఈ యాప్స్ ద్వారా ఆధార్ కార్డు, ఆర్థిక వివరాలు వంటి వ్యక్తిగత గుర్తింపు సమాచారం, కాంటాక్ట్‌లు, గ్యాలరీ, కెమెరా వంటి మొదలైన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారని కేంద్రం తెలిపింది. అలాగే గూగుల్ ద్వారా ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలిపింది. దీంతో నిబంధనలకు విరుద్దంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండటంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇలాంటి యాప్స్‌ను వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.