LIC Share: కనిష్ఠ స్థాయిని చేరుకున్న ఎల్ఐసీ షేర్.. ఇప్పటి వరకూ రూ. 94,116 కోట్ల సంపద ఆవిరి.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..
LIC Share: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు లాభాలు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా తొలిసారిగా స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టడంతో వారు మార్కెట్ హెచ్చు తగ్గులను చూసి భయపడుతున్నారు.
LIC Share: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు లాభాలు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా తొలిసారిగా స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టడంతో వారు మార్కెట్ హెచ్చు తగ్గులను చూసి భయపడుతున్నారు. ఎల్‌ఐసీ షేర్ ధర ప్రస్తుతం 52 వారాల కనిష్ఠ స్థాయిని చేరుకుంది. గత వారం చివరి ట్రేడింగ్ రోజున.. బిఎస్‌ఈలో షేరు 0.69 శాతం పతనమై రూ. 800.25 వద్ద ముగిసింది. ఎల్‌ఐసీ స్టాక్‌లో 52 వారాల గరిష్ఠ ధర రూ.920 కాగా.. ఇప్పటి వరకు నమోదైన కనిష్ట ధర రూ.800గా ఉంది. LIC IPO ఇష్యూ ధర రూ. 949తో పోల్చుకుంటే దాదాపు షేరు రూ.150 వరకు నష్టపోయింది. ఈ విధంగా స్టాక్ విలువ 16% పడిపోయింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గమనిస్తే.. శుక్రవారం బిఎస్‌ఈలో రూ.5,06,157 కోట్లకు పడిపోయింది. LIC IPO ఇష్యూ ధర అప్పర్ బ్యాండ్ ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 6,00,242 కోట్లుగా ఉంది. అంటే దాదాపుగా కంపెనీ క్యాప్ లో రూ.94 వేల కోట్లు ఆవిరైపోయింది.
ఇటీవలి కాలంలో మార్కెట్లో లిస్ట్ అయిన Paytm, Zomato, Nykaa వంటి కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయిన పెట్టుబడిదారులకు ఎల్ఐసీ మరింత పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో ఎల్ఐసీ ర్యాంకింగ్ 5వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయింది. LIC మార్కెట్ క్యాప్.. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్, ICICI బ్యాంక్ కంటే తక్కువగా ఉంది.
బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ “ది ఎలిఫెంట్ దట్ కాంట్ డ్యాన్స్” అనే నివేదికలో ఎల్‌ఐసీపై హోల్డ్ రేటింగ్ ఇచ్చింది. బ్రోకరేజ్ సంస్థ జూన్ 2023 వరకు టార్గెట్ ధర రూ. 875గా అంచనా వేసింది. ఈ వారం ప్రారంభంలో ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో, ఎల్‌ఐసీ కొత్త వ్యాపార మార్జిన్‌లకు ప్రైవేట్ కంపెనీలతో సమానంగా విలువ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలు నిరాశ పరిచాయి. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 17.41 శాతం క్షీణించింది. కానీ.. ఇదే సమయంలో కంపెనీ నికర ప్రీమియం ఆదాయం మాత్రం 17.88 శాతం పెరిగింది. ఫలితాలను విడుదల చేస్తున్నప్పుడు, కంపెనీ పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూపాయిన్నర డివిడెండ్‌ను ఎల్ఐసీ ప్రకటించింది.