ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన లెక్సస్ తన మొదటి ఎలక్ట్రిక్ వేరియంట్ కారును మన దేశంలో లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. సెల్ప్ చార్జడ్ హైబ్రిడ్ కార్లకు పెట్టింది పేరైనా ఈ బ్రాండ్ నుంచి వచ్చే రెండేళ్లలో కొత్త ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో విడుదల కానుంది. ఈ మేరకు లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని పేర్కొన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ సర్వే చేస్తోందని, అన్ని కుదిరితే 2025 నాటికి లెక్సస్ బ్రాండ్ నుంచి కొత్త లగ్జరీ కారు మన దేశంలో లాంచ్ అవ్వడం ఖాయమని చెబుతున్నాయి.
వాస్తవానికి లెక్సస్ కంపెనీ ఆరేళ్ల క్రితమే మన దేశంలో బిజినెస్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ లగ్జరీ కార్ల విషయంలో తనదైన ముద్ర వేసుకోలేకపోయింది. ఇదే లగ్జరీ కార్ల సెగ్మెంట్ లో జర్మనీ ఆటో మేకర్స్ దూసుకుపోతున్నారు. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ కార్లు ఈ సెగ్మెంట్ అత్యధిక సేల్స్ చేపడుతున్నాయి. ఈ మూడు మోడళ్లు జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్లే కావడం గమనార్హం. ఈ మూడు కూడా మన దేశంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లను లాంచ్ చేశాయి. ఈ క్రమంలో లెక్సస్ కూడా తన ఈవీని త్వరితగతిన ఇక్కడ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
కొత్త ఈవీ లగ్జరీ కార్ విడుదలకు సంబంధించిన ప్రణాళిక గురించి లెక్సస్ ప్రెసిడెంట్ సోని వివరించారు.2022లోనే కొన్ని కార్లను మన దేశంలో పరీక్షించినట్లు చెబుతున్నారు. ఇక్కడ రోడ్లు, వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ.. వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ను కూడా తీసుకున్నట్లు వివరించారు. తద్వారా తమకు చాలా విలువైన సమచారం అందిందని, ఇక్కడి మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయి? ఏ కాలంలో ఏ విధంగా సేల్స్ ఉంటాయి? వంటివి అధ్యయనం చేసినట్లు చెప్పారు. అన్ని కుదిరితే 2025 తమ మొట్టమొదటి ఈవీ లగ్జరీ కారును భారతదేశ మార్కెట్లో లాంచ్ చేస్తామని సోని స్పష్టం చేశారు.
2025 నాటికి ఇండియాలో ఎలక్ట్రిక్ కారు లాంచ్ తో పాటు 2035 నాటికి గ్లోబల్ వైడ్ గా ఎలక్ట్రిఫై కావడంపై లెక్సస్ దృష్టి సారించింది. అలాగే ఇతర లగ్జరీ కార్ మేకర్స్ అయిన మెర్సిడెస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ వంటి కంపెనీకు పోటీగా తమ కొత్త ఈవీ ఉండబోతుందని లెక్సస్ ప్రకటించింది. అందుకోసం దేశ వ్యాప్తంగా 23 టచ్ పాయింట్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. వీటిని కార్ల సేల్స్ కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..