పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో ఆర్థిక లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ విధించిన ఆంక్షలకు లక్షలాది మంది కస్టమర్లు ప్రభావితులయ్యారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎంలో (Paytm)లో లావాదేవీలు జరపవచ్చా? పేటీఎం వ్యాలెట్‌లో డిపాజిట్ చేసిన డబ్బు ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు పేటీఎం వినియోగదారుల మదిలో మెదులుతున్నాయి. అయితే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఆర్థిక లావాదేవీలను ఆర్బీఐ ఎందుకు నిషేధించింది? ఈ డిజిటల్ పేమెంట్ బ్యాంక్ చేసిన నేరం ఏమిటి? నివేదికల కేవైసీ సమాచారంలో విస్తృతంగా అవినీతి జరిగింది. వందలాది ఖాతాలకు అసలు గుర్తింపు లేదు. కస్టమర్ పేరు, సమాచారం వివరాలు, కేవైసీ లేకుండానే ఈ ఖాతాల నుంచి కోట్లాది ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది.
ఆర్థిక లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. కానీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ మాత్రం ఆ నిబంధనను పాటించలేదు. పేటీఎంకు భారీ ఖాతాలు ఉన్నాయి. వీటిలో కేవైసీ సమాచారం లేదు. పేరులేని ఈ ఖాతాల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ అనుమానిస్తోంది. అందుకే పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఆర్థిక లావాదేవీలపై ఆర్బీఐ నిషేధం విధించింది.
నివేదికల ప్రకారం.. 1000 యూజర్స్‌కి సంబంధించిన అకౌంట్స్ అన్నింటికీ.. ఒక్కటంటే ఒక్కటే పాన్ ఉన్నట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆడిటర్లు వెరిఫికేషన్ చేసినప్పుడు వారు భారీ అక్రమాలను కనుగొన్నారు. అప్పుడే పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక ఆంక్షలు విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా సమాచారం అందించింది. ఈ ఆర్థిక మోసానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం అందించినట్లు సమాచారం.
పేటీఎం పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆర్థిక అవినీతి, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయా అనే విషయాన్ని ఈడీ పరిశీలిస్తుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి