
మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదో ఒక చోట జేసీబీ మెషీన్ కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడైనా ఇళ్లు కట్టినా, రోడ్లు తవ్వుతున్నా, భారీ పనులు జరుగుతున్నా అక్కడ జేసీబీ ఉండాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నిర్మాణ యంత్రాల సంస్థ ఇది. భారతదేశంతో సహా వందలాది దేశాలలో దీని వాడకం విపరీతంగా ఉంది. అయితే ప్రతిరోజూ చూసే ఈ జేసీబీ పూర్తి పేరు ఏంటి? అసలు ఇవన్నీ పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?.. చాలా మంది జేసీబీ అనేది ఒక యంత్రం పేరు అనుకుంటారు. కానీ నిజానికి అది సదరు యంత్రాన్ని తయారు చేసే కంపెనీ పేరు. దీని పూర్తి పేరు జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్. 1945లో ఈ సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుడి పేరే దీనికి పెట్టారు. మొదట్లో ఇదొక చిన్న ఇంజనీరింగ్ కంపెనీగా ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో ఎక్స్‌కవేటర్లు, బ్యాక్‌హో లోడర్ల వంటి భారీ పరికరాలను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదిగింది. నేడు జేసీబీ అనేది కేవలం ఒక వ్యాపార నామం మాత్రమే కాదు.. నిర్మాణ రంగానికి, అభివృద్ధికి ఒక గ్లోబల్ చిహ్నంగా మారింది.
సీబీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బ్రైట్ పసుపు రంగు. అయితే కంపెనీ ఈ రంగును కేవలం అందం కోసమో, ఫ్యాషన్ కోసమో ఎంచుకోలేదు. దీని వెనుక బలమైన శాస్త్రీయ, భద్రతా కారణాలు ఉన్నాయి. పసుపు రంగుకు హై విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. పగటి పూట అయినా, చీకటి పడిన రాత్రి సమయంలో అయినా పసుపు రంగు చాలా దూరం నుండి జనాల కంటికి స్పష్టంగా ఆనుతుంది. నిర్మాణ స్థలాలలో భారీ యంత్రాలు, వందలాది మంది కార్మికులు కలిసి పనిచేస్తుంటారు. అలాంటప్పుడు అక్కడ నడిచే జేసీబీ యంత్రాలు దూరం నుంచే అందరికీ స్పష్టంగా కనిపించి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేయడానికి ఈ పసుపు రంగు ఎంతగానో సహాయపడుతుంది. అందుకే భద్రతను దృష్టిలో ఉంచుకుని జేసీబీలను పసుపు రంగులో డిజైన్ చేశారు.
జేసీబీ కంపెనీ ప్రారంభించిన కొత్తలో.. అంటే 1940ల కాలంలో ఈ యంత్రాలను తెలుపు, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసేవారు. కానీ నిర్మాణ స్థలాలలో ఇవి సరిగ్గా కనిపించకపోవడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో.. సుదీర్ఘ పరిశోధనల తర్వాత కంపెనీ తన బ్రాండ్ రంగును పూర్తిగా పసుపు లోకి మార్చేసింది. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో JCB అనే పదాన్ని ఒక అధికారిక బ్రాండ్ నేమ్‌గా గుర్తించారు. అంతేకాదు భారీ తవ్వకాలు జరిపే ఏ యంత్రాన్నైనా సాధారణ భాషలో జేసీబీ అని పిలవడం ఒక అలవాటుగా మారిపోయింది. జేసీబీ కంపెనీ కేవలం తవ్వకం యంత్రాలే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే ఫాస్ట్‌ట్రాక్ అనే ట్రాక్టర్‌ను కూడా తయారు చేసింది. ఇది గంటకు ఏకంగా 217 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గిన్నిస్ రికార్డ్ సృష్టించింది.
జేసీబీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో భారత్ అత్యంత కీలకమైనది. మన దేశంలో ఢిల్లీ, పూణే, జైపూర్ వంటి నగరాల్లో జేసీబీకి భారీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడి నుండే వందకు పైగా దేశాలకు జేసీబీ యంత్రాలు ఎగుమతి అవుతున్నాయి. రోడ్డు పక్కన జేసీబీ తవ్వకాలు జరుపుతుంటే టైమ్ పాస్ కోసం చూసే మనకు.. దాని వెనుక ఇంత పెద్ద భద్రతా సూత్రం, అంతర్జాతీయ చరిత్ర దాగుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.