ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో నవశకం ఆరంభమైంది. మేడ్ ఇన్ ఇండియా తొలి కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. సెల్టాస్ మోడల్ వాహనాన్ని గురువారం కియా సంస్థ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో కియా సంస్థ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన కియా మోటార్స్ కంపెనీ అతివేగంగా నిర్మాణం జరిగింది. అంతేవేగంగా కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో తయారైన తొలి కారును గురువారం విడుదల చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రామానికి సీఎం జగన్ హాజరుకావాల్సి ఉంది. ఢిల్లీ పర్యటన ఆలస్యం కావడంతో ఆయన రాలేకపోయారు.