AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio IPO GMP: గ్రే మార్కెట్‌లో జియో తుఫాన్.. ఒక్కో షేరుపై రూ.212 ప్రీమియం.. లిస్టింగ్ రోజే అదిరే లాభాలు..?

మార్కెట్లోకి రాకముందే గ్రే మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో షేరుపై ఏకంగా రూ.212 ప్రీమియం పలుకుతుండటంతో లిస్టింగ్ రోజే దాదాపు 19 శాతం వరకు లాభాలు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రూ.30,213 కోట్ల మెగా ఇష్యూకి దరఖాస్తు చేసుకుంటే ఎంత లాభం రావచ్చు? ఒక లాట్‌కు ఎంత పెట్టుబడి పెట్టాలి? గ్రే మార్కెట్ నంబర్లు చెబుతున్న పూర్తి లెక్కలు ఇవే..

Jio IPO GMP: గ్రే మార్కెట్‌లో జియో తుఫాన్.. ఒక్కో షేరుపై రూ.212 ప్రీమియం.. లిస్టింగ్ రోజే అదిరే లాభాలు..?
Jio Platforms Ipo Gmp Jumps To Rs 212
Krishna S
|

Updated on: Oct 15, 2026 | 6:50 PM

Share

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై గ్రే మార్కెట్‌లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 21న ప్రారంభం కానున్న ఈ మెగా ఐపీఓకు సంబంధించి అనధికార గ్రే మార్కెట్ ప్రీమియం అక్టోబర్ 15 నాటికి రూ.212 వద్ద స్థిరపడింది. ప్రైస్ బ్యాండ్ గరిష్ట ధర రూ.1,119తో పోలిస్తే, ప్రస్తుత ప్రీమియం ప్రకారం జియో షేరు స్టాక్ ఎక్స్ఛేంజీలలో దాదాపు రూ.1,331 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనా. అంటే లిస్టింగ్ రోజే మదుపరులకు సుమారు 18.95 శాతం లాభం వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కనీస బిడ్ పరిమాణాన్ని 12 షేర్లుగా ఖరారు చేశారు. గరిష్ట ధర రూ.1,119 ప్రకారం చూస్తే.. ఒక లాట్ దరఖాస్తు చేసుకోవడానికి రిటైల్ మదుపరులకు రూ.13,428 పెట్టుబడి అవసరమవుతుంది. ప్రస్తుత గ్రే మార్కెట్ ధర వద్ద షేరు లిస్ట్ అయితే.. ఒక్క లాట్‌పై దాదాపు రూ.2,544 మేర లిస్టింగ్ గెయిన్ దక్కే అవకాశం ఉంటుంది. అయితే గ్రే మార్కెట్ అనేది అనధికారికమైనది కావడంతో మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఈ ప్రీమియం మారవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రూ.30,213 కోట్ల ఫ్రెష్ ఇష్యూ.. అప్పుల విముక్తికే ప్రాధాన్యం

ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 27 కోట్ల తాజా షేర్లను విక్రయించి మొత్తం రూ.30,213 కోట్లను సమీకరించనుంది. ఇందులో ప్రమోటర్ల వాటా విక్రయం ఏదీ లేకపోవడం వల్ల నిధులన్నీ నేరుగా కంపెనీకే చెందుతాయి. ఈ మొత్తంలో సింహభాగం అంటే రూ.27,500 కోట్లను జియో ప్లాట్‌ఫామ్స్ ప్రధాన అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాల ముందస్తు లేదా పూర్తి చెల్లింపులకే కేటాయించారు. దీని ద్వారా కంపెనీ పూర్తిగా రుణ రహిత సంస్థగా అవతరించి ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది.

మఖ్యమైన తేదీలు

  • ఐపీఓ ప్రారంభ తేదీ: 2026 అక్టోబర్ 21
  • ఐపీఓ ముగింపు తేదీ: 2026 అక్టోబర్ 23
  • షేర్ల కేటాయింపు : 2026 అక్టోబర్ 26
  • స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్: 2026 అక్టోబర్ 28

బలమైన ఆర్థిక పురోగతి.. రూ.30,052 కోట్ల నికర లాభం

2019 నవంబర్‌లో ఏర్పాటైన జియో ప్లాట్‌ఫామ్స్.. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్, 5G, ఫిక్స్‌డ్ లైన్, క్లౌడ్, ఐఓటీ, జియోబ్రెయిన్ ఏఐ ప్లాట్‌ఫామ్ వంటి సాంకేతిక రంగాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. జూన్ 30, 2026 నాటికి జియో 53.33 కోట్ల మంది చందాదారులకు సేవలందిస్తూ, దేశ జనాభాలో 99 శాతానికి పైగా నెట్‌వర్క్ పరిధిని విస్తరించింది. కంపెనీ పేరిట 7,220 పేటెంట్ దరఖాస్తులు ఉన్నాయి. ఆర్థిక ఫలితాల విషయానికొస్తే.. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,49,759.10 కోట్లకు పెరిగింది. నికర లాభం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.26,120 కోట్ల నుంచి రూ.30,052.70 కోట్లకు ఎగబాకింది. ఎబిట్డా కూడా ఏకంగా రూ.76,255.40 కోట్లను తాకింది. 2026 జూన్ త్రైమాసికంలోనే సంస్థ రూ.40,197.90 కోట్ల ఆదాయాన్ని, రూ.7,764.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

కొటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, సిటీగ్రూప్, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి 19 ప్రముఖ అంతర్జాతీయ, స్వదేశీ మర్చంట్ బ్యాంకర్లు ఈ మెగా ఇష్యూకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా.. కెఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. బలమైన ఆర్థిక మూలాలు, స్పష్టమైన వృద్ధి ప్రణాళిక ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్లు కేవలం గ్రే మార్కెట్ ప్రీమియంపై మాత్రమే ఆధారపడకుండా కంపెనీ ప్రాస్పెక్టస్‌లోని రిస్క్ అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us