AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో డేట్స్ రిలీజ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ఇషా అంబానీ

Reliance Jio IPO: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో, కేవలం పెట్టుబడుల సమీకరణ మాత్రమే కాదని, భారతదేశ డిజిటల్ పరివర్తనలో సామాన్య ప్రజలను నేరుగా భాగస్వాములను చేసే సరికొత్త ప్రయాణమని ఇషా అంబానీ స్పష్టం చేశారు.

Jio IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో డేట్స్ రిలీజ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ఇషా అంబానీ
Isha Ambani On Reliance Jios Journey
Anand T
|

Updated on: Oct 15, 2026 | 6:38 PM

Share

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో, కేవలం పెట్టుబడుల సమీకరణ మాత్రమే కాదని, భారతదేశ డిజిటల్ పరివర్తనలో సామాన్య ప్రజలను నేరుగా భాగస్వాములను చేసే సరికొత్త ప్రయాణమని ఇషా అంబానీ స్పష్టం చేశారు. జియో ప్లాట్‌ఫామ్స్ తన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (RHP) దాఖలు చేసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె సంస్థ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆకాష్, నేను అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో సెలవుల కోసం ముంబైలోని ఇంటికి వచ్చాం. ఆ సమయంలో నేను ఒక కాలేజ్ అసైన్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి ప్రయత్నిస్తే, ఇంటర్నెట్ సరిగ్గా లేకపోవడంతో సబ్మిట్ చేయలేకపోయాను. పశ్చిమ దేశాల్లో లభించే అత్యుత్తమ ఇంటర్నెట్ కనెక్టివిటీ మన భారతదేశంలో ఎందుకు లభించకూడదు? అనే ప్రశ్న ఆ క్షణంలో మా ఇద్దరిలో తలెత్తింది అని ఇషా అంబానీ గుర్తు చేసుకున్నారు. భారతీయ వినియోగదారుల కనెక్టివిటీ అవసరాలను తీర్చేందుకు ఒక డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడమే సరైన పరిష్కారమని ఆకాష్ అంబానీ బలంగా నమ్మారని ఆమె పేర్కొన్నారు. ఆ విధంగా, కాలేజ్ అసైన్‌మెంట్ సబ్మిట్ చేయడంలో ఎదురైన చిన్న సాంకేతిక అంతరాయమే దేశంలో టెలికాం విప్లవానికి నాంది పలికి, రిలయన్స్ జియో ఏర్పాటుకు బలమైన పునాది వేసిందని ఆమె వెల్లడించారు.

ఈ ఆలోచనల ఫలితంగానే సెప్టెంబర్ 2016లో రిలయన్స్ జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఉచిత వాయిస్ కాల్స్, అత్యంత చౌకైన డేటా సేవలతో భారత టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టిన జియో, దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగాన్ని అనూహ్య స్థాయికి చేర్చింది.

త్వరలో మార్కెట్లోకి జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో:

దాదాపు దశాబ్దం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ మార్కెట్లలో లిస్టింగ్‌కు సిద్ధమైంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 1,065 నుంచి రూ. 1,119గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 19న ప్రారంభం కానుండగా, సాధారణ ఇన్వెస్టర్లకు అక్టోబర్ 21న అందుబాటులోకి వచ్చి, అక్టోబర్ 23న ముగియనుంది. సుమారు 27 కోట్ల సరికొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా దాదాపు రూ. 30,213 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

సమీకరించిన నిధులలో కొంత భాగాన్ని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాల చెల్లింపునకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.ఈ ఐపీవో ప్రణాళికను రిలయన్స్ తమ 2025 ఏజీఎంలో ప్రకటించగా, జూన్ 19, 2026న ముసాయిదా పత్రాలను సమర్పించింది. అనంతరం ఆగస్టు 28న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి తుది అనుమతి పొందింది.

రిలయన్స్ అనుసరించే 3 వ్యాపార సూత్రాలు:

  • వ్యాపార విస్తరణలో రిలయన్స్ గ్రూప్ అనుసరించే మూడు ప్రాథమిక సూత్రాలను ఈ సందర్భంగా ఇషా అంబానీ వివరించారు
  • దీర్ఘకాలిక ప్రణాళిక: స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దశాబ్దాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం.
  • భారీ స్థాయి: సంబంధిత పరిశ్రమ ముఖచిత్రాన్నే మార్చగల భారీ స్థాయి కార్యాచరణను రూపొందించడం.
  • కచ్చితమైన అమలు: రూపొందించుకున్న ప్రణాళికలను ఎక్కడా లోపాలు లేకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us